నెల్లూరులో 'కుబేర'... ఇది మామూలు స్కామ్ కాదు!
ఈ క్రమంలో 2022-24 మధ్య జరిగిన ఒక స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘కుబేర’ సినిమాను గుర్తుకు తెస్తోంది.
By: Tupaki Desk | 20 July 2025 5:00 PM ISTమోసపోయేవాళ్లు ఉండాలే కానీ మోసం చేసేవాళ్లకు కొదవలేదని అంటారు. నేరం చేసిన తర్వాత దొరకడం పక్కా అనేదానికి ఎన్నో రుజువులు ఉన్నప్పటికీ.. తాము మాత్రం దొరకం అనే భావనలో చాలా మంది తెగించేస్తుంటారు. ఈ క్రమంలో 2022-24 మధ్య జరిగిన ఒక స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘కుబేర’ సినిమాను గుర్తుకు తెస్తోంది.
అవును... ఇటీవల విడుదలైన ‘కుబేర’ సినిమాలో బ్లాక్ మనీ తరలింపుకు నలుగురు అమాయకులను పట్టుకుని, వారితో కంపెనీలు ఓపెన్ చేయించి, వారిని సీఈవోలుగా చేసి, డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయిస్తారు. దాదాపుగా ఇదే తరహాలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో అమాయక గిరిజనుల పేరున రుణాలు తీసుకుని రూ.10.56 కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారు.
వివరాళ్లోకి వెళ్తే... నెల్లూరు జిల్లాలో ఓ నలుగురు వ్యక్తులు ఫేక్ కంపెనీలు ఓపెన్ చేశారు. అందులో అమాయక గిరిజనులను ఉద్యోగాలు ఇస్తామని జాయిన్ చేసుకున్నారు! ఈ సమయంలో వారికి ఆరు నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు స్టేట్ మెంట్లు క్రియేట్ చేశారు! అనంతరం వారందరి పేరుమీద యాక్సిస్ బ్యాంక్ లో లోన్స్ అప్లై చేశారు.
ఈ క్రమంలో సుమారు 56 మంది పేరిట లోన్లు తీసుకుని రూ.10.60 కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో... లోన్లు తిరిగి చెల్లించాలంటూ గిరిజనులకు నోటీసులు పంపింది యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం. దీంతో నోటీసులు అందుకున్న గిరిజన యువకులు షాక్ తిన్నారు. తమకు ఏమీ సంబంధం లేదని మొత్తుకున్నారు!
ఈ నేపథ్యంలో ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బ్రాంచ్ మేనేజర్. మరోవైపు ఈ భారీ స్కామ్ లో బ్యాంకు ఉద్యోగుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు! ఈ స్కామ్ 2022-24 మధ్య జరిగినట్లు గుర్తించారని అంటున్నారు.
