Begin typing your search above and press return to search.

వేమిరెడ్డి దంపతుల గుప్పెట్లో నెల్లూరు.. టీడీపీలో హాట్ టాపిక్

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోయిందనే టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   30 Oct 2026 6:00 PM IST
వేమిరెడ్డి దంపతుల గుప్పెట్లో నెల్లూరు.. టీడీపీలో హాట్ టాపిక్
X

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోయిందనే టాక్ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే పదవులను చేపట్టిన వేమిరెడ్డి దంపతులు ప్రస్తుతం జిల్లా రాజకీయాలను శాసిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రధానంగా ఎంపీ వేమిరెడ్డికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారని, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఆయన చెప్పినట్లే నడుచుకోవాలని పార్టీ హైకమాండ్ కూడా సూచించినట్లుగా చెబుతున్నారు. దీంతో జిల్లాలో వేమిరెడ్డి మాటకు ఎదురు లేకుండా పోయిందని అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణగా మేయర్, జడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక అద్దం పడుతోందని అంటున్నారు.

నెల్లూరు మేయరుగా రూప్ కుమార్ యాదవ్, జడ్పీ చైర్మనుగా పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎంపిక వెనుక ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఉన్నారనే ప్రచారం జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తోంది. రూప్ కుమార్ యాదవ్ పేరును అధికారికంగా ఖరారు చేయగా, జడ్పీ చైర్మనుగా పోలంరెడ్డి పేరును ఇంకా ప్రకటించాల్సివుందని చెబుతున్నారు. అయితే ఎంపీ వేమిరెడ్డి దంపతుల అండదండలు ఉండటంతో పోలంరెడ్డి పేరు ప్రకటించడం లాంఛనమే అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి తన కుమారుడికి గత ఎన్నికల్లో కోవూరు టికెట్ ఆశించారు. అయితే వారికి కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పట్లో తన విజయానికి సంపూర్ణ సహకారం అందించిన పోలంరెడ్డి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పట్టుబట్టి మరీ పోలంరెడ్డికి జడ్పీ చైర్మనుగా ఎంపిక చేసేలా పావులు కదిపారని అంటున్నారు.

నిజానికి జడ్పీ చైర్మన్ పదవికి టీడీపీలో తీవ్ర పోటీ నెలకొందని ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డి, కంభం విజయరామరెడ్డి ఈ పదవిని ఆశించారు. వంటేరు వేణుగోపాలరెడ్డికి అధిష్టానం మద్దతు కూడా ఉందన్న ఉద్దేశ్యంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బహిరంగ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా తన నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ జడ్పీటిసి స్థానానికి నామినేషన్ వేయించారు. కంభం విజయరామిరెడ్డి సైతం తన స్వగ్రామం దుత్తలూరు నుంచి పోటీకి దిగారు. ఇదే సమయంలో కోవూరు పరిధిలోని ఇందుకూరుపేట నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోటీకి దిగారు. ఈ ముగ్గురిలో ఎవరికి జడ్పీ పీఠం దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతుండగా, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చాకచక్యంగా పావులు కదిపి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు చేయించారని అంటున్నారు.

ఇలా మిగిలిన ఆశావహులను కాదని వేమిరెడ్డి దంపతులు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి పేరు సిఫార్సు చేయడానికి ప్రత్యేక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో పోలంరెడ్డి సహకరించడం ఒక ఎత్తు అయితే భవిష్యత్తులో వారి నుంచి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఇక జిల్లాలో జడ్పీ ఎన్నికల ఖర్చును తమ కుటుంబమే భరిస్తున్నందున తాను అనుకున్న వారికే జడ్పీ పీఠం దక్కేలా వేమిరెడ్డి దంపతులు పావులు కదిపారని అంటున్నారు. ఈ విషయంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చేతులు ఎత్తేయాల్సివచ్చిందని చెబుతున్నారు. తమకు అత్యంత సన్నిహితులు అయిన రూప్ కుమార్ కి మేయర్ టికెట్, పోలంరెడ్డికి జడ్పీ చైర్మన్ గిరీ ఇప్పించడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి దంపతులు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారారని అంటున్నారు. మొత్తానికి రాజకీయంగా ఎందరో ఉద్దండులు ఉన్న నెల్లూరు జిల్లాల్లో ఎంపీ వేమిరెడ్డి హవా ప్రస్తుతం నడుస్తోందని విశ్లేషిస్తున్నారు.