Begin typing your search above and press return to search.

నెల్లూరు.. నేతల తీరే వేరు ..!

నెల్లూరు జిల్లా నాయ‌కుల తీరు వేరేగా ఉందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ హ‌వా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   15 Nov 2025 12:00 AM IST
నెల్లూరు.. నేతల తీరే వేరు ..!
X

నెల్లూరు జిల్లా నాయ‌కుల తీరు వేరేగా ఉందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ హ‌వా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. వైసీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ సునాయాసంగా గెలుపు గుర్రం ఎక్కింది. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సీనియ‌ర్లు ఉన్నారు. నెల్లూరు ఎంపీ నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు దాదాపు రెడ్లే క‌నిపిస్తున్నారు. కానీ, నేత‌ల తీరు చూస్తే.. ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.

నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయ‌ణ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న మంత్రిగా ఉన్నారు. కానీ.. ఆయ‌న‌తో మాట్లాడి.. ప‌నులు చేయించుకునేందుకు కొంద‌రు ముందుకు రావ‌డం లేదు. పైగా ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టుగా కూడా అభివృద్ధి ప‌నులు కూడా ముందుకు తీసుకువెళ్ల‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి. ఆత్మ‌కూరు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఆనం రాం నారాయ‌ణ‌రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. అంటే.. జిల్లాకు ఇద్ద‌రు మంత్రులు ఉన్నారు.

ఇద్ద‌రూ సీనియ‌ర్ నాయ‌కులు, పైగా చంద్ర‌బాబు వ‌ద్ద మంచి పేరు కూడా ఉన్న నాయ‌కులు. కానీ, మం త్రుల‌తో క‌ల‌సి ప‌నులు చేయించుకునేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రావ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ‌.. ఎవ‌రికి వారు త‌మ త‌మ‌పంథాలోనే ముందుకు సాగుతున్నారు. ఇక‌, పార్టీ కార్య‌క్ర‌మాల్లో కొంద‌రు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. హైద‌రాబాద్‌లో తిష్ఠ‌వేశార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. కేవ‌లం ఇప్ప‌టికి ఈ 17 మాసాల్లో చాలా తక్కువ సార్లు మాత్ర‌మే నియోజ‌కవ‌ర్గంలో క‌నిపించార‌ని చెబుతున్నారు.

ఇక‌, మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు.. పూర్తిగా మీడియాకు మాత్ర‌మే క‌నిపిస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది. అంటే.. వారు కేవ‌లం మీడియా ముందు ప్ర‌క‌ట‌న‌లు చేసి. కార్యాల‌యాల్లో హాజ‌రు వేయించుకుని వెళ్లిపోతున్నారట‌. సో.. ఇలా.. నాయ‌కులు ఎవ‌రికి వారుగా మార‌డంతో నెల్లూరు రాజ‌కీయాల్లో జోష్ పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఎవ‌రికి వారుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఎవ‌రికి తోచిన ప‌నులు వారు చేయ‌డంతో పార్టీ ప‌రంగా అనుకున్నంత మైలేజీ రావ‌డం లేద‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది.