Begin typing your search above and press return to search.

సీఐ, ఎస్ఐతోపాటు 25 మంది పోలీసులకు పనిష్మెంట్.. స్టేషన్ మొత్తం ఖాళీ.. నెల్లూరు ఎస్పీ సంచలన నిర్ణయం

ఏపీ పోలీసు చరిత్రలో ఒక పోలీసుస్టేషన్ సిబ్బంది అందరినీ ఒకేసారి బదిలీ చేసిస ఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

By:  Tupaki Political Desk   |   14 July 2026 5:14 PM IST
సీఐ, ఎస్ఐతోపాటు 25 మంది పోలీసులకు పనిష్మెంట్.. స్టేషన్ మొత్తం ఖాళీ.. నెల్లూరు ఎస్పీ సంచలన నిర్ణయం
X

ఏపీ పోలీసు చరిత్రలో ఒక పోలీసుస్టేషన్ సిబ్బంది అందరినీ ఒకేసారి బదిలీ చేసిస ఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఒక వ్యవసాయాధికారి అనుమానాస్పద మృతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో సీఐ, ఎస్ఐతోపాటు మొత్తం 25 మంది పోలీసు సిబ్బంది బదిలీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన వ్యవసాయాధికారి (ఏవో) నడవాటి శ్రీహరి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఘటనపై ఏవో సహచరులు, సహోద్యుగులు పోలీసులకు సమాచారం ఇచ్చినా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు నిర్ధారించారు. దీంతో సీఐ, ఎస్ఐని వీఆర్ కు పంపగా, మిగిలిన సిబ్బంది అందరినీ జిల్లాలో వేర్వేరు పోలీసుస్టేషన్లకు బదిలీ చేశారు.

ఒక పోలీసుస్టేషన్ కు చెందిన సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇప్పటివరకు చోటుచేసుకోలేదని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విధి నిర్వహణలో లోపాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం సహజమే అయినప్పటికీ ఇంతటి సీరియస్ యాక్షన్ తీసుకోవడమే సంచలనం రేపుతోంది. మృతుడి భార్య ఫిర్యాదుతో డీఎస్పీ దర్యాప్తు చేయగా, పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందని చెబుతున్నారు. దీంతో విషయం ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి వెళ్లగా, ఆమె తీవ్ర ఆగ్రహానికి గురై స్టేషన్ సిబ్బంది అందరిపై ఒకేసారి వేటు వేశారు.

ఈ ఘటన నెల్లూరు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పోలీసువర్గాలలో సంచలన చర్చకు దారితీసింది. ఇటీవల కాలంలో పోలీసుల అనేక ఆరోపణలు వస్తుండగా, నెల్లూరు ఎస్పీ తీసుకున్న చర్యతో విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు అయిందని అంటున్నారు. కాగా, తీవ్ర చర్చనీయాంశం అయిన ఈ ఘటనలో ఏవో శ్రీహరి మరణంపై హత్య కేసు నమోదు చేయగా, నిందితులకు సహకరించారనే కారణంగా కొందరు పోలీసులను కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

హత్య చేసి గుండెపోటు డ్రామా?

కాగా, ఒక పోలీసుస్టేషన్ సిబ్బంది మొత్తంపై బదిలీ వేటు పడేలా చేసిన ఏవో శ్రీహరి మృతి కేసు విస్తృత చర్చనీయాంశం అవుతోంది. శ్రీహరిని సొంత బావమరిది హరికృష్ణ, మరికొందరి సాయంతో అంతమొందించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెబుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం నుంచి ఏవో స్వగ్రామమైన కొత్తమినగల్లుకు శ్రీహరిని కారులో తీసుకువెళ్లిన హరికృష్ణ మార్గమధ్యలో కుక్కులకు ఇచ్చే మత్తుమందును బలవంతంగా ఇంజెక్షన్ రూపంలో శ్రీహరికి ఇచ్చి ఆ తర్వాత ఊపిరాడకుండా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగా బావ శ్రీహరిని హత్య చేయాలని నిందితుడు కుట్ర పన్నగా, అతడికి మరో ఇద్దరు సహకరించినట్లు చెబుతున్నారు. అయితే శ్రీహరి గుండెపోటుతో మరణించారని తొలుత కుటుంబ సభ్యులను నిందితుడు నమ్మించడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని అంటున్నారు. మరోవైపు మృతదేహం ఉన్నప్పుడే శరీరంపై గాయాలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినా, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదన్న కారణంగా పోలీసు అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. అయితే తొలుత భర్త గుండెపోటుతో మరణించారని భావించిన భార్య లావణ్య తర్వాత సోదరుడిపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా, అసలు విషయం వెలుగుచూసిందని చెబుతున్నారు.