నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుట్ర చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 29 Aug 2025 8:45 PM ISTనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుట్ర చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొంత మంది రౌడీషీటర్లు పూటుగా మద్యం సేవించి ఓ హోటల్ లో కోటంరెడ్డి హత్యపై మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలుగా మారింది. దీంతో నెల్లూరు నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానితులను అదుపులోకి తీసుకోడానికి గాలింపు మొదలుపెట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రతను పెంచారు.
ఇటీవల నెల్లూరు రాజకీయాలు కాకరేపుతున్నాయి. గత నెలలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఆ తర్వాత అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలోనే వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఓ రౌడీషీటర్ నెల్లూరు సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తుండగా, అతడికి పెరోల్ పై విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో పెద్ద వివాదం జరిగింది.
అయితే ఇప్పుడు కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్నట్లుగా బయటకు వచ్చిన వీడియోలో రౌడీషీటర్ శ్రీకాంత్ అనుచరులే ఉండటం గమనార్హం. అయితే రౌడీషీటర్ శ్రీకాంత్ ను పెరోల్ పై విడుదల చేసేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖ ఇచ్చినట్లు వైసీపీ ఆరోపణలు చేస్తోంది. కానీ, శ్రీకాంత్ వ్యవహారశైలిపై ప్రభుత్వానికి సమాచారం రావడంతో పెరోల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు వీడియో లీక్ కావడం సంచలనం రేపుతోంది.
వీడియోలో ఉన్నవారు రౌడీషీటర్ శ్రీకాంత్ అనుచరులుగా చెబుతున్నారు. శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు జగదీష్ తోపాటు మరో ఇద్దరు రౌడీ షీటర్లు ఆ వీడియోలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ముగ్గురు కాకుండా ఉన్న మరో ఇద్దరు కూడా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘‘కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు’’ అన్న వ్యాఖ్యలతో ఈ వీడియో ప్రారంభమవగా, కోటంరెడ్డిని లేపేసిన వారికి సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందని కూడా చర్చించుకున్నారు. వీడియోలో ఉన్నవారంతా బాగా తాగి ఉండగా, వారిని ఎవరు అలా రెచ్చగొట్టారనేది తెలియాల్సివుందని అంటున్నారు.
కాగా, ఈ వీడియో పోలీసులకు ఐదురోజుల ముందే అందిందని, దీనిపై రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. కోటంరెడ్డిని అంతమొందించాలని ప్లాన్ చేస్తున్నది ఎవరు? ఆయనకు ప్రాణహాని తలపెట్టే శత్రువులు ఎవరు ఉన్నారు..? నిందితులకు డబ్బు, ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసింది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐదు రోజులుగా రహస్యంగా విచారణ చేస్తున్న పోలీసులు, వీడియో బయటకు రాగానే కొందరు నిందితులను వారితో సంబంధాలు ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు కోటంరెడ్డి హత్యకు ప్లాన్ జరుగుతుందని తెలియగానే నెల్లూరు నగరంలో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. టీడీపీ అధిష్టానం కూడా ఈ సమాచారంపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ వీడియోతో నెల్లూరు వంటి నగరంలో రౌడీలు రెచ్చిపోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీషీటర్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు రంగంలోకి దిగారని అంటున్నారు.
