Begin typing your search above and press return to search.

నెల్లూరు మంగళం శ్రీను అనిల్.. అబ్బాయిపై విరుచుకుపడిన బాబాయ్

నెల్లూరులో పాన్ షాప్ వద్ద ఖాళీగా కూర్చుని టైం పాస్ చేసే అనిల్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి కార్పొరేటర్ ను చేస్తే, ఆయన ఇప్పుడు పుష్ప సినిమాలో మంగళం శ్రీనులా తయారయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు రూప్ కుమార్.

By:  Tupaki Desk   |   21 May 2025 4:16 PM IST
నెల్లూరు మంగళం శ్రీను అనిల్.. అబ్బాయిపై విరుచుకుపడిన బాబాయ్
X

నెల్లూరులో బాబాయి, అబ్బాయి మధ్య లొల్లి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బెజవాడలో బ్రదర్స్ మధ్య గొడవ పొలిటికల్ హీట్ పుట్టిస్తుండగా, నెల్లూరులోనూ రక్త సంబంధీకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇటీవల నెల్లూరులో టీడీపీ నేతలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రపై మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన విమర్శలకు కౌంటరుగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సొంత బాబాయ్ కావడం విశేషం.

నెల్లూరులో పాన్ షాప్ వద్ద ఖాళీగా కూర్చుని టైం పాస్ చేసే అనిల్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి కార్పొరేటర్ ను చేస్తే, ఆయన ఇప్పుడు పుష్ప సినిమాలో మంగళం శ్రీనులా తయారయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు రూప్ కుమార్. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి అయిన అనిల్ కుమార్ అవినీతితో తన పరువు తీశాడని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే హోదాలో అనిల్ చేసిన దందాలను పూసగుచ్చినట్లు వివరించారు.

పుష్ప విలన్ మంగళం శ్రీను మాదిరిగా నెల్లూరు విలన్ గా అనిల్ తయారయ్యాడంటూ రూప్ కుమార్ చేసిన ఆరోపణ తీవ్ర చర్చకు దారితీస్తోంది. కరోనా సమయంలో ఓ ఆస్పత్రి యాజమాన్యాన్ని బెదిరించి లక్షల రూపాయలు దండుకున్నాడని, షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలను రూ.7 లక్షల చొప్పున విక్రయించాడని, ఇరిగేషన్ మంత్రిగా కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడని తీవ్ర ఆరోపణలు చేశఆరు. అధికారం అడ్డం పెట్టుకుని వందల కోట్లు పోగేశాడు. అధికారం పోయిన తర్వాత చెన్నైకి వెళ్లి దాక్కున్నాడు, దుబాయ్ లో పెట్టుబడులు పెడుతున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అనిల్ ను రాజకీయాల్లోకి ఎందుకు తెచ్చానా? అంటూ ఇప్పుడు తాను బాధ పడుతున్నట్లు ఆయన బాబాయ్ అయిన రూప్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అనిల్ చేసిన ఆరోపణలపైనా రూప్ కుమార్ స్పందించారు. జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి కంపెనీ ఒక్కటే క్వార్ట్జ్ రవాణా చేయడం లేదని చెప్పారు. అనేక సంస్థలు క్వార్ట్జ్ మైనింగ్, రవాణా చేస్తున్నాయని తెలిపారు. ఇక నెల్లూరు సిటీకి చెందిన అనిల్ కుమారుకు వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం క్వార్ట్జ్ మైనింగుతో ఏంటి సంబంధమని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఇల్లీగల్ మైనింగు జరిగింది కాబట్టే ఫైన్స్ వేశారు. కూటమి ప్రభుత్వంలో యే మైన్స్ మీదా ఫైన్స్ వేయలేదని చెప్పారు.

గత ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళితే తానే ముఖ్యమంత్రి అవుతానని అనికుమార్ చెప్పినట్లు రూప్ కుమార్ తీవ్ర ఆరోపణ చేశారు. 2014లో ఓ క్రికెట్ బుకీ నుంచి రూ.5 లక్షలు పార్టీ ఫండ్ కూడా తీసుకున్నాడని ఆరోపించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు రూప్ కుమార్ యాదవ్ సొంత బాబాయ్. గత ప్రభుత్వంలో అనిల్ మంత్రిగా పనిచేయగా, రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో రూప్ కుమార్ టీడీపీలో చేరి తన పదవిని కాపాడుకున్నారు. ఇక మాజీ మంత్రి వేమిరెడ్డికి ఒకప్పుడు ఇద్దరూ సన్నిహితులుగా చెబుతారు. అయితే అనిల్ తో విభేదాల కారణంగా గత ఎన్నికల ముందు ఆయనకు టికెట్ ఇవ్వొద్దని అప్పట్లో వైసీపీలో ఉన్న వేమిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆ కారణంగానే అనిల్ ను నెల్లూరు నుంచి మార్చి నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నిలబెట్టింది. అయినప్పటికీ వీరి మధ్య విభేదాలు సమసిపోలేదు. నెల్లూరులో అనిల్ మాటకే మాజీ సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారనే కారణంతో వేమిరెడ్డితో సహా ఆయన గ్రూపు టీడీపీలో చేరింది.