Begin typing your search above and press return to search.

నెల్లిమర్ల సీటు వెరీ స్వీట్ గురూ...!

విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల సీటు మీద టీడీపీ జనసేన రెండూ మోజు పడుతున్నాయి. ఈ సీటు దాంతో స్వీట్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 3:53 AM GMT
నెల్లిమర్ల సీటు వెరీ స్వీట్ గురూ...!
X

విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల సీటు మీద టీడీపీ జనసేన రెండూ మోజు పడుతున్నాయి. ఈ సీటు దాంతో స్వీట్ గా మారిపోయింది. నెల్లిమర్ల సీటు ఈ జిల్లాలో తమకే కావాలని రెండు పార్టీలూ పట్టుపడుతున్నాయి. నెల్లిమర్లకు అంతటి విశేషం ఎందుకు వచ్చింది అంటే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి అంతా నెల్లిమర్ల చుట్టూనే సాగుతోంది.

జిల్లా కేంద్ర స్థానం అయిన విజయనగరానికి లేని డిమాండ్ ఇపుడు నెల్లిమర్లకు వచ్చేసింది. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోనే భోగాపురం అంతర్జాతీయ విమనాశ్రయం నిర్మాణం అవుతోంది. ఇది కనుక పూర్తి అయితే నెల్లిమర్ల దశ తిరిగినట్లే అంటున్నారు. ఒక్కసారి శంషాబాద్ ఎయిర్ పోర్టుని తలపించేలా ఈ ప్రాంతం కూడా మారిపోతుంది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా ఇక్కడికే వచ్చి పోతూంటారు అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు సహా ఎవరు ఉత్తరాంధ్రాకు రావాలన్నా భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి రావాలి.

అలా భోగాపురం పరిధిలో ఉన్న నెల్లిమర్లకు కూడా జాతకం మారిపోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎంతో విలువ ప్రోటోకాల్ మర్యాదలు దక్కుతాయి. భోగాపురం ఎయిర్ పోర్టు మొదటి దశ పనులు 2025 నాటికి పూర్తి అవుతాయి. తొలి విమానం కూడా అదే ఏడాది ఎగరనుంది.

అంటే ఈ ఏడాది ఎమ్మెల్యే ఎవరు అవుతారో కానీ వారు లక్కీ అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో మరో విశాఖగా కూడా ఈ ప్రాంతం మారుతుంది కాబట్టి ఎలాగైనా నెల్లిమర్ల ఎమ్మెల్యే అయిపోతే చాలు అని అంతా అనుకుంటున్నారు. వైసీపీలోనూ ఈ సీటుకు గట్టి పోటీ ఉంది కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడే మరోసారి ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన జగన్ కి ఇష్టుడైన విజయనగరం జెడ్పీ చైర్మన్ బొత్స మేనల్లుడుకి స్వయాన వియ్యంకుడు.

ఇక టీడీపీలో చూస్తే మొదటి నుంచి వర్గ పోరు ఈ సీటు కోసం సాగుతోంది. మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి తమ కుటుంబానికే ఈ సీటు వదిలేయమని కోరుతున్నారు. అయితే మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజుని ఇంచార్జిగా నియమిస్తూ చాలా కాలం క్రితం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆ పార్టీలో వర్గ పోరు అలాగే సాగుతోంది.

ఇపుడు కొత్తగా జనసేన కూడా ఇదే సీటు కోరుతోంది. లోకం మాధవిని తమ అభ్యర్ధిగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు పవన్ ల మధ్య జరిగిన పొత్తు చర్చలలో నెల్లిమర్ల సీటు కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ సీటు తమకు వదిలేయాలని పవన్ కోరినట్లుగా కూడా ప్రచారంలో ఉంది.

అయితే సామాజిక సమీకరణలో భాగంగా ఈ సీటులో తమ అభ్యర్ధి గెలిచే చాన్స్ ఉందని బాబు అన్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సీటు మీద పట్టు వదలకూడదని జనసేన భావిస్తోందిట. ఈ సీటు విషయంలో ఎందాకైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారుట. మరి ఇంతటి హాట్ ఫేవరేట్ సీటు పొత్తులో దక్కినా వర్గ పోరుతో సతమతమవుతున్న కూటమికి విజయం దక్కుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.