Begin typing your search above and press return to search.

ఈ రైల్వే స్టేషన్ లో టికెట్లు కొంటారు.. కానీ ట్రైన్ ఎక్కరు

చదివినంతనే విచిత్రంగా అనిపించొచ్చు కానీ.. ఇది నిజం. అయినా రోజూ టికెట్లు కొంటారే కానీ రైలు ఎందుకు ఎక్కరన్న సందేహం రావొచ్చు

By:  Tupaki Desk   |   12 Feb 2024 9:30 AM GMT
ఈ రైల్వే స్టేషన్ లో టికెట్లు కొంటారు.. కానీ ట్రైన్ ఎక్కరు
X

చదివినంతనే విచిత్రంగా అనిపించొచ్చు కానీ.. ఇది నిజం. అయినా రోజూ టికెట్లు కొంటారే కానీ రైలు ఎందుకు ఎక్కరన్న సందేహం రావొచ్చు. కానీ.. అందుకో కారణం ఉంది. తమ ఊరికి ఉన్న రైల్వే స్టేషన్ ఎక్కడ పోతుందన్న భయంతో నిత్యం రైల్ టికెట్లు కొనుగోలు చేసి.. తమ స్టేషన్ ను కాపాడుకునేందుకు అక్కడి స్థానికులు చేసే పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ లో ఈ తంతు కొన్నేళ్లుగా సాగుతోంది. ఈ రైల్వేస్టేషన్ లో రోజువారీగా 60 టికెట్ల వరకు కొనుగోలు చేస్తారు. కానీ.. ఒక్కరంటే ఒక్కరు కూడా రైలు ఎక్కరు. తమ ఊరికి ఉన్న ఒక్క రైలు హాల్టింగ్ రద్దు కాకూడదన్న ఉద్దేశంతో అక్కడి ప్రజలు ఈ ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సాయం కోసం స్థానిక వ్యాపారులు..దాతలు కొందరు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తుండటం విశేషంగా చెప్పాలి.

నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి నెక్కొండ ఒక్కటే రైల్వే స్టేషన్. దీంతో.. ఆయా మండలాలకు చెందిన ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. తిరుపతి.. హైదరాబాద్.. ఢిల్లీ.. శిరిడీ తదితర ముఖ్య ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఈ స్టేషన్ లో హాల్ట్ లేదు. దీంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే.. ఉన్న కొద్ది రైళ్లు కూడా ఆదాయం సరిగా లేదన్న సాకుతో రైళ్లను రద్దు చేస్తుంటారు. కొంతకాలం క్రితం పద్మావతి ఎక్స ప్రెస్ (సికింద్రాబాద్ - తిరుపతి) తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్ లో స్టాప్ ఉంది. దాన్ని రద్దు చేశారు.

ప్రయాణికులు పలుమార్లు కోరిన మీదన సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ కల్పించారు. అయితే.. మూడు నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని లేకుంటే రైలును రద్దు చేస్తామని షరతు పెట్టారు రైల్వే అధికారులు. దీంతో.. హాల్టింగ్ కోల్పోకూడదనుకున్న గ్రామస్థులు ఒక్కటై.. నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో 400 మంది చేరారు. వీరంతా ఇప్పటివరకు రూ.25వేల వరకు విరాళాలు సేకరించారు. ప్రతి రోజు వారు నెక్కొండ నుంచి ఖమ్మం.. సికింద్రాబాద్.. తదితర ప్రాంతాలకు రైల్వే టికెట్లు కొనుగోలు చేయటం ద్వారా.. స్టేషన్ కు ఆదాయం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఊరి రైల్వే స్టేషన్ లో మరిన్ని రైళ్ల హాల్ట్ కోసం ఇంత ప్రయాసకు గురవుతున్నారు.