Begin typing your search above and press return to search.

వర్ధంతి వేళ నెహ్రూ తప్పు ఎత్తి చూపిన మోడీ

దేశ విభజన తరువాత పాక్ చేసిన తొలి ఉగ్రవాద దాడిని భారత్ సమగ్రంగా ఎదుర్కోవాల్సింది అని మోడీ అన్నారు.

By:  Tupaki Desk   |   27 May 2025 10:00 PM IST
వర్ధంతి వేళ నెహ్రూ తప్పు ఎత్తి చూపిన మోడీ
X

ఈ రోజు దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ వర్ధంతి. ఆయన 1964 మే 27న మరణించారు. నెహ్రూ ఈ దేశాన్ని ఏకంగా 17 ఏళ్ళ పాటు పాలించారు. భారత రాజ్యాంగం తయారు కాక ముందు తొలి మూడేళ్ళు ఆయన పాలించారు. ఆ తరువాత 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలు అయిన తరువాత తొలిసారి గా 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కాంగ్రెస్ ని ఆయన గెలిపించారు అలా రెండోసారి ప్రధాని అయ్యారు. 1957, 1962లలోనూ కాంగ్రెస్ నెహ్రూ నాయకత్వంలో గెలిచింది. అయితే చివరిసారిగా గెలిచిన రెండేళ్ళకే నెహ్రూ మరణించారు.

ఇక నెహ్రూ ఈ దేశానికి ఏమి చేశారు అన్న దాని మీద ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. నెహ్రూ తనదైన విధానాలతో భారత్ ని ఆధునిక దేశంగా తీర్చి దిద్దారు. పంచవర్ష ప్రణాళికలతో అటు వ్యవసాయిక రంగం, పారిశ్రామిక రంగంలలో కూడా దేశంలో పెద్ద పీట వేశారు. ఆధునిక దేవాలయాలు పరిశ్రమలు అని నెహ్రూ చాటారు. అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతిని పెంచారు. అలీన విధానం తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రపంచంలో భారత్ ని ఉన్నత దేశంగా తీర్చిదిద్దారు.

అయితే నెహ్రూ విదేశాంగ విధానం మీద నాటి జనసంఘ్ నేటి బీజేపీ కూడా విమర్శలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాకుండా నెహ్రూ తీసుకున్న నిర్ణయాల పుణ్యం వల్లనే ఈ రోజుకీ రావణ కాష్టంగా రగులుతోందని అంటారు. 1947 అక్టోబర్ లో భారత్ పాకిస్తాన్ ల మధ్య వచ్చిన తొలి యుద్ధంలో భారత సైన్యం జయించి పాక్ సైన్యాన్ని తరిమి కొడుతున్న వేళ ఐక్యరాజ్య సమితికి కాశ్మీర్ విషయం మీద ఫిర్యాదు చేయడం యుద్ధం ఆపించడం నెహ్రూ విదేశాంగ విధానంలో పొరపాట్లు అని బీజేపీ అంటూ వస్తోంది.

ఇక గుజరాత్ లో గత రెండు రోజులుగా పర్యటిస్తూ వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాక్ కి వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. పాక్ ఉగ్ర పీచమణచేశామని ఆయన గట్టిగా చెప్పుకొస్తున్నారు. భారత్ జోలికి వస్తే ఏమి జరుగుతుందో పాక్ కి ఈ పాటికి ఆర్ధం అయిందని కూడా మోడీ సెటైర్లు వేశారు. భారత్ దెబ్బకు పాక్ ఎయిర్ బేస్ లు ఈ రోజుకీ ఐసీయూలోనే ఉన్నాయని కూడా మోడీ ఎద్దేవా చేస్తున్నారు.

పనిలో పనిగా ఆయన కాంగ్రెస్ పాలకుల మీద కూడా నిప్పులు చెరిగారు. దేశ విభజన తరువాత పాక్ చేసిన తొలి ఉగ్రవాద దాడిని భారత్ సమగ్రంగా ఎదుర్కోవాల్సింది అని మోడీ అన్నారు. 1947లో భారత్ మూడు ముక్కలైందని అదే సమయంలో కాశ్మీర్ గడ్డపై తొలి ఉగ్ర వాద దాడికి పాక్ తెగించింది అని ఆయన గుర్తు చేశారు. భారత్ లోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ముజాహిదీన్ పేరుతో ఆక్రమించుకుందని చెప్పారు. అయితే ఆ రోజే ముజాహిదీన్లు అని పిలవబడే వారిని మృత్యు కూపంలో పడేయాల్సింది అని మోడీ అన్నారు.

కాశ్మీర్ లోని మూడవ వంతు ఆక్రమించిన పీవోకేను వెనక్కి తీసుకునేంతవరకూ భారత్ యుద్ధం ఆపి ఉండాల్సింది కాదని మోడీ అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనలను కూడా ఎవరూ పట్టించుకోలేదని ఆయన పరోక్షంగా నెహ్రూ జమానా మీద విమర్శలు చేశారు దాని ఫలితమే డెబ్బై అయిదేళ్ళుగా ముజాహిదీన్ల ఉగ్రవాదంతో భారత్ యుద్ధం చేస్తోందని రక్తపాతాన్ని భరిస్తోందని మోడీ అన్నారు. పహల్గాం ఉగ్ర దాడి ఆనాటి దానికి కొనసాగింపే అని ఆయన అన్నారు.

ప్రత్యక్ష యుద్ధంలో భారత్ తో గెలవలేమని గ్రహించిన పాకిస్తాన్ ఉగ్ర మూకలను పోగు చేసి పరోక్ష యుద్ధానికి ఉగ్రవాదానికి తెర లేపిందని మోడీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధం పాకిస్థాన్ ఎంతో ప్లాన్ చేసి భారత్ మీద చేయిస్తున్న యుద్ధమని ఆయన అభివర్ణించారు.

మొత్తానికి పాక్ ని విమర్శించే క్రమంలో తొలి ప్రధాని నెహ్రూ పీఓకేను వెనక్కి తీసుకుని రాలేకపోయారు అన్న విమర్శలు పరోక్షంగా మోడీ చేశారని అంటున్నారు. దీని మీద కాంగ్రెస్ ధీటుగానే స్పందించింది. ప్రధాని మోడీకి చరిత్ర గురించి ఏ మాత్రం అవగాహన లేదని కాంగ్రెస్ అంటోంది.

పటేల్ పక్కా కాంగ్రెస్ వాది సెక్యులర్ అని పేర్కొంది ఆర్ఎస్ఎస్ ఆనాడు గాంధీ నెహ్రూలతో పాటు పటేల్ దిష్టిబొమ్మలను కూడా దహనం చేసిందిని కనగ్రెస్ పేర్కొంది. పటేల్ ని ఆర్ఎస్ఎస్ విమర్శించిందని గుర్తు చేసింది. ఇవన్నీ ఇలా ఉంటే నెహ్రూ వర్ధంతి వేళ ఆయన తొలి ప్రధానిగా కొన్ని తప్పులు చేశారని భావిస్తూ వాటిని మోడీ మరోసారి జాతి ముందు ఎత్తి చూపించారని చర్చ సాగుతోంది.