Begin typing your search above and press return to search.

పీఎన్‌బీ కుంభకోణంలో కీలక మలపు.. అమెరికాలో నేహాల్ మోదీ అరెస్ట్

నీరవ్ మోదీ పీఎన్‌బీ నుంచి అనధికారిక లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ (LOUs) ద్వారా రూ.13,500 కోట్ల మేర లోన్లు పొంది మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   5 July 2025 9:54 PM IST
పీఎన్‌బీ కుంభకోణంలో కీలక మలపు.. అమెరికాలో నేహాల్ మోదీ అరెస్ట్
X

ప్రముఖ వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ సోదరుడు నేహల్ దీపక్ మోదీని అమెరికాలో అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థన మేరకు అక్కడి పోలీసులు నేహల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది రూ. 13,500 కోట్ల పీఎన్‌బీ మోసంలో కీలక పరిణామంగా మారింది.

నేహల్ మోదీ పీఎన్‌బీ స్కాంలో కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయగా, దానిని రద్దు చేయించేందుకు నేహల్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవలే అమెరికాలో అతడిని అరెస్ట్ చేశారు. నేహల్‌కు బెల్జియం పౌరసత్వం ఉన్నప్పటికీ, భారత్‌లో నమోదైన క్రిమినల్ కేసుల దృష్ట్యా భారత్ అప్పగింతను కోరింది. జూలై 17న నేహల్ మోదీ అప్పగింతకు సంబంధించి విచారణ జరగనుంది. అదే రోజున అతను బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

- నీరవ్ మోదీ కేసు ప్రస్తుత స్థితి

నీరవ్ మోదీ పీఎన్‌బీ నుంచి అనధికారిక లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ (LOUs) ద్వారా రూ.13,500 కోట్ల మేర లోన్లు పొంది మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018లో భారత్ నుంచి పారిపోయిన నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లోని జైలులో ఉన్నారు. అతనికి ఇప్పటివరకు 10 సార్లు బెయిల్ ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమయ్యాయి.

-మెహుల్ చోక్సీపై దర్యాప్తు

ఈ కేసులో మరొక కీలక నిందితుడు, నీరవ్ మోదీ మామ మెహుల్ ఛోక్సీ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇండియన్ ఏజెన్సీలు అతడిపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

- అంతర్జాతీయ స్థాయిలో భారత్ విజయం

ఆర్థిక నేరగాళ్లను దేశానికి రప్పించడంలో భారత ప్రభుత్వం ఇటీవల విజయాలు సాధిస్తోంది. ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రాణాను అమెరికా అప్పగించిన నేపథ్యంలో, నేహల్ మోదీని కూడా భారత్‌కు రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ అరెస్ట్ పీఎన్‌బీ కుంభకోణంపై తిరిగి దృష్టిని కేంద్రీకరించేందుకు సహాయపడుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను దేశానికి రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భారత ప్రభుత్వానికి ఈ అరెస్టులు మరింత సహాయపడతాయని భావిస్తున్నారు.