ఉగ్రదాడిపై ఫోక్ సింగర్ దారుణ కామెంట్స్.. దేశద్రోహం కేసులు నమోదు
తాజాగా ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై కూడా ఇదే తరహా చర్యలు తీసుకోవడం గమనార్హం.
By: Tupaki Desk | 28 April 2025 2:16 PMనోరుమంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు. మన దేశంపైకి వచ్చి మన ప్రజలన పిట్టాల్లా కాల్చిచంపిన ఉగ్రవాదులపై దేశమంతా ఆగ్రహావేశాలు వెల్లగక్కుతంటే.. కొందరు మాత్రం మన దేశంలోనే ఉంటే.. మనకే వెన్నుపోటు పొడిచేలా ప్రవర్తిస్తున్నారు. దాయాాది పాకిస్తాన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి దేశద్రోహులపై దేశంలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
లక్నోకు చెందిన అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. నేహా సింగ్ రాథోడ్ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులు జాతీయ సమగ్రతపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయని, మతం ఆధారంగా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నేహా సింగ్ రాథోడ్ చేసిన ట్వీట్లను పరిశీలించారు. ఈ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచింది. ఈ దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు లేదా రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కొంతమంది నెటిజన్లపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై కూడా ఇదే తరహా చర్యలు తీసుకోవడం గమనార్హం.
గతంలో కూడా తన పాటలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచిన నేహా సింగ్ రాథోడ్, తనపై కేసు నమోదు కావడంపై స్పందించారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ప్రశ్నించారు. లాయర్ ఫీజు చెల్లించడానికి తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని పేర్కొంటూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఆమె పోస్టులు పాకిస్తాన్‌లో వైరల్ అయ్యాయని.. పాకిస్తాన్ మీడియా వీటిని భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటుందని కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన ప్రవర్తన ఆవశ్యకతను ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది.