ఎవరీ నేహా భండారీ.. ఇప్పుడెందుకు వైరల్ అవుతున్నారు?
పహల్గాం ఉగ్రదాడి.. అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఇప్పటివరకు వెలుగు చూడని కొన్ని కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 29 May 2025 10:15 AM ISTపహల్గాం ఉగ్రదాడి.. అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఇప్పటివరకు వెలుగు చూడని కొన్ని కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. ఆ కోవలోకే వస్తారు ఏకైక మహిళా బీఎస్ఎఫ్ అధికారి నేహా భండారి. ఆమె ప్రత్యేకతను చెప్పాలంటే.. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఒక బోర్డర్ అవుట్ పోస్ట్ కు కమాండ్ చేసిన ఏకైక మహిళా అధికారి ఆమే కావటం విశేషం. ఉత్తరాఖండ్ కు చెందిన ఆమె.. ఆపరేషన్ సిందూర్ వేళ.. తన సిబ్బందితో అసమాన ధైర్య సాహసాల్ని ప్రదర్శించటమేకాదు.. పాక్ కుయుక్తుల్ని.. దాడుల్ని సమర్థంగా ఎదుర్కొంటూ తమ సత్తా చాటారు. తాజాగా ఆమె ధైర్య సాహసాలను ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేయటంతో ఆమె ప్రతిభ ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. దీంతో.. నేహా భండారీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు.
నేహా భండారీ విధులు నిర్వర్తించిన పోస్టు పాకిస్థాన్ పోస్టుకు కేవలం 150 మీటర్ల దూరంలో ఉంది. పహాల్గాం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. పాక్ రేంజర్లు మన భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు చేపట్టారు. అయితే.. నేహా ఈ దాడులకు ఏ మాత్రం బెదరక.. తన టీంతో సమర్థంగా తిప్పి కొట్టటమే కాదు.. తమకు అందుబాటులో ఉన్న ప్రతి ఆయుధాన్ని వారు వినియోగించటం విశేషం. అంతేకాదు.. వీరి టీంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లు శత్రు దాడిని తిప్పికొట్టటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తించినప్పటికీ.. తనకెంతో గర్వంగా ఉందన్న ఆమె.. తన టీంలోని ఏ ఒక్కరు కూడా వెరవకుండా పోరాడినట్లు చెప్పారు. తమ పోరాట పటిమతో పురుష సిబ్బందితో పోలిస్తే మహిళలు ఏ మాత్రం తక్కువ కాదన్న విషయాన్ని నిరూపించామన్నారు. తనతో పాటు 18-19 మంది మహిళా బోర్డర్ గార్డులు ఉంటే.. వారిలో ఆరుగురు గన్ పొజిషన్లలో ఉంటూ శత్రు దాడిని నేరుగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లు.. మోర్టార్ షెల్స్ ను సమర్థంగా కూల్చేసినట్లు చెప్పారు.
ఇక.. నేహా భండారీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె 2022లో బీఎస్ఎఫ్ లో చేరారు. ఆమెది ఆర్మీ ఫ్యామిలీగా చెప్పాలి. ఎందుకంటే ఆమె తాత ఆర్మీలో పని చేయగా.. తండ్రి సీఆర్ఫీఎఫ్ లో పని చేసి రిటైర్ అయ్యారు. తల్లి కూడా ప్రస్తుతం సీఆర్పీఎఫ్ లో విధులు నిర్వర్తిస్తుండటం విశేషం. వీరి కుటుంబంలో సైన్యంలో చేరిన మూడో తరంగా ఆమెను చెప్పాలి. ప్రస్తుతం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పోస్టులో అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఉదంతం బాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తీసిపోనిదిగా చెప్పక తప్పదు.
