Begin typing your search above and press return to search.

గంజాయి నీతూబాయికి బ్యాంకులో రూ.1.63 కోట్లు.. సిటీలో రెండు ప్లాట్లు!

గంజాయి అమ్ముతూ నీతూబాయి కుటుంబం ఎనిమిదేళ్లలో ఇంత సంపాదించినట్లు చెబుతున్నారు టీఎస్ న్యాబ్ పోలీసులు

By:  Tupaki Desk   |   15 March 2024 5:18 AM GMT
గంజాయి నీతూబాయికి బ్యాంకులో రూ.1.63 కోట్లు.. సిటీలో రెండు ప్లాట్లు!
X

హైదరాబాద్ లోని నానక్ రాంగూడలో గంజాయి విక్రయాలు సాగిస్తోన్న నీతూబాయిని టీఎస్ న్యాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సినీపక్కీలో అన్నట్లుగా ప్లాన్ చేసి మరీ ఆమె వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు పోలీసులు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా బహిరంగంగా గంజాయి వ్యాపారం చేస్తూ.. వ్యాపార స్థలానికి నాలుగు అంచెల కంచె ఏర్పాటుచేసుకున్న నీతూబాయి ఆస్తుల వివరాలు తెరపైకి వచ్చాయి.

అవును... పైకి సాదాసీదా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నట్లు కనిపించే ఓ మహిళ బ్యాంక్ అకౌంట్ లో సుమారు రూ.1.63 కోట్ల డబ్బు.. హైదరాబాద్ సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉన్నాయంట. గంజాయి అమ్ముతూ నీతూబాయి కుటుంబం ఎనిమిదేళ్లలో ఇంత సంపాదించినట్లు చెబుతున్నారు టీఎస్ న్యాబ్ పోలీసులు. దీంతో ఈమె ఆస్తుల వివరాలు తెలుసుకుని షాక్ అవుతున్నారు ప్రజానికం!

వీరి వ్యాపారం ఈస్థాయిలో మూడు పువ్వులూ ఆరు కాయలుగా మారడానికి గల కారణాలను వివరిస్తున్నారు పోలీసులు! ఇందులో భాగంగా... ధూల్ పేటకు చెందిన అంగూరిబాయి నుంచి కిలో గంజాయి రూ.8 వేల చొప్పుకున కొంటున్న నీతూబాయి... దాన్ని ఐదేసి గ్రాముల చొప్పున చిన్న చిన్న పొట్లాల్లో నింపి ఒక్కో ప్యాకెట్ ను రూ.500కు అమ్ముతుందట. దీంతో.. కిలో గంజాయితో రూ.50వేల వరకూ సంపాదిస్తుందని చెబుతున్నారు.

కాగా... బుధవారం టీఎస్ న్యాబ్ పోలీసులు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ లో నీతూబాయితో పాటు ఆమె భర్త మున్ను సింగ్ (53), బంధువులు మమత (50), సురేఖ (38)తో పాటు 13మంది గంజాయి వినియోగదారులు వెరసి మొత్తం 17మందిని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో వీరి నుంచి 22.6 కిలోల గంజాయి, రూ. 22.10 లక్షల నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.