ఎవరికి వాళ్లు చేతులు ముడుచుకుంటారా? నీట్‌పై సుప్రీంకోర్టు ఫైర్
ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకు వ్యవహారాన్ని సుమోటోగా విచారణ స్వీకరించిన సుప్రీంకోర్టు.. తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
By: Garuda Media | 29 May 2026 11:12 PM ISTదేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులను సంకటంలోకి నెట్టేసిన నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు) పేపర్ లీకు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం.. నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్.. లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిం దేనన్న డిమాండ్లు కూడా వినిపించాయి.
అయితే.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉంది. మరోవైపు నీట్ పరీక్షను వచ్చే నెల 21న మరోసారి నిర్వహిస్తామని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. పరీక్ష రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే.. ఇది పరిష్కారం కాదని.. బాధ్యత వహించాలని.. కేంద్రం దీనిపై స్పందించాలని దేశవ్యాప్తంగా ఎస్ ఎఫ్ ఐ సహా.. అనేక విద్యార్థి సంఘాలు ఉద్యమించాయి. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నిరసనపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. పలు చోట్ల విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. కేసులు పెట్టారు. ఇలా.. దేశవ్యాప్తంగా.. పెను దుమారానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకు వ్యవహారాన్ని సుమోటోగా విచారణ స్వీకరించిన సుప్రీంకోర్టు.. తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎవరికి వారు చేతులు ముడుచుకుని కూర్చుంటే.. నీట్ పేపర్ లీకు వ్యవహారానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించింది. అంతేకాదు.. అనేక వ్యవస్థలను అనుసంధానం చేసి.. ప్రత్యేక అధికారులను నియమించి.. పటిష్ఠ భద్రతను కల్పించిన తర్వాత కూడా.. నీట్ ప్రశ్న పత్రం బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. అనేక యంత్రాంగాలు, కమిటీలు ఉన్నప్పటికీ.. ఏం చేసినట్టని నిలదీసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఇలా నిర్దయగా వదిలేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ పరీక్ష వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. నీట్ పేపర్ లీకు ఎలా జరిగిందన్న విషయంపై ఇప్పటికే సీబీఐని వేశామని.. పలువురిని అరెస్టు కూడా చేశామని వివరించింది. జూన్ 21న తిరిగి నిర్వహించే పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. అదేసమయంలో నీట్ పరీక్ష నిర్వహణలోనూ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని వివరించింది. అయినప్పటికీ.. సుప్రీంకోర్టు శాంతించలేదు. కేంద్రం వివరణ ఇవ్వాలని కోరింది. జూలై రెండోవారానికి విచారణను వాయిదావేసింది.
