వెంకటగిరిలో వైసీపీ కి అదే ఇబ్బంది
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైసీపీలో నాయకులు ఆపశోపాలు పడుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 25 Feb 2026 4:00 AM ISTఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైసీపీలో నాయకులు ఆపశోపాలు పడుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఉన్నారు. కానీ, ఈయనకు బలమైన వాయిస్ లేదన్నది స్థానిక నేతలు చెబుతున్న మాట. పైగా.. ఆయన కలుపుగోలుగా ఉండలేకపోతున్నారని కూడా అంటున్నారు. ఆది నుంచి బలమైన రాజకీయాలు చేయడంలో రాంకుమార్ వెనుకబడ్డారు. ఇదే ఆయనకు మైనస్‌గా మారింది.
ఇప్పటికీ రాం కుమార్ క్లాస్‌గా ఉండడం.. మాస్ తరహా రాజకీయాలు చేయలేని పరిస్థితిని ఎదుర్కోవడం వంటివి ఆయనకు ప్రధానంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని వైసీపీ రెండు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అయితే.. ఒక్కటి కూడా ఇక్కడ సమర్థవంతంగా నిర్వహించలేక పోయారని, నాయకులను ముందుండి నడిపించలేక పోయారని అంటున్నారు. మరో వైపు.. పార్టీలోనే సమన్వయం సమస్య వెంటాడుతోందని చెబుతున్నారు.
ఇక, స్థానిక సమస్యలపై ప్రస్తావించేందుకు కూడా ఆయన చొరవ చూపలేకపోతున్నారన్నది నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. బలమైన టీడీపీ ఒకవైపు.. కూటమి సమన్వయం మరోవైపు.. ఉందని.. దీనిని తట్టుకుని వెంకటగిరిలో నేదురుమల్లి వారసుడు పాగా వేయాలంటే.. ఇంకా బలంగా కష్టపడాల్సి ఉందని అంటున్నారు. కానీ, ఆ తరహాలో రాజకీయాలు ఇక్కడ ముందుకు సాగడం లేదని అంటున్నారు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం.. నాలుగు విమర్శలు చేయడం వరకు పరిమితం అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
వారసత్వం నిలబడేనా..?
మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ.. రాం కుమార్ రెడ్డికి పెద్దగా సింపతీ దక్కలేదన్నది వాస్తవమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆయనను గ్రామీణ స్థాయిలో ప్రజలు ఇప్పటికీ గుర్తించలేక పోతున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన పుంజుకునే విధంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. మరోవైపు.. కేడర్ కూడా నిస్సత్తువలోనే ఉందని.. వారిని ఎంగేజ్ చేసేలా ఆయన వ్యవహరించడం లేదని అంటున్నారు. మరి దీనిని బట్టి రాం కుమార్ తన షెడ్యూల్ మార్చుకుంటారో లేదో చూడాలి.
