Begin typing your search above and press return to search.

సభ నిర్వహణలో ఎన్డీయే ఫెయిలైనట్లేనా ?

అధికార, ప్రతిపక్ష సభ్యులు తన మాట వినడం లేదు కాబట్టి తాను లోక్ సభకు రానని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించటం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:42 AM GMT
సభ నిర్వహణలో ఎన్డీయే ఫెయిలైనట్లేనా ?
X

పార్లమెంటు ఉభయ సభలను సజావుగా నిర్వహించటంలో ఎన్డీయే పూర్తిగా ఫెయిలైపోయింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు తన మాట వినడం లేదు కాబట్టి తాను లోక్ సభకు రానని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించటం సంచలనంగా మారింది. ప్రకటించటమే కాదు బుధవారం అసలు సభలోకి అడుగుపెట్టనేలేదు. కారణం ఏమిటంటే అధికార, ప్రతిపక్ష ఎంపీల్లో ఎవరూ తన ఆదేశాలను లెక్కచేయటం లేదట. అలాంటపుడు తాను సభకు ఎందుకు రావాలన్నది స్పీకర్ లాజిక్.

ఇక రాజ్యసభ విషయాన్ని తీసుకుంటే ప్రధానమంత్రిని సభకు రావాల ని తాను ఆదేశించలేనని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ థన్ కడ్ తన అశక్తతను అంగీకరించారు. ఉభయసభల కు ప్రతిపక్ష ఎంపీలు వచ్చినా రాకపోయినా అధికారపార్టీ ఎంపీలు మాత్రం వచ్చితీరాలి. అలాగని రూలేమీలేదు.

కానీ సభాకార్యక్రమాల ను అధికారపార్టీయే పట్టించుకోకపోతే ఇక ప్రతిపక్ష ఎంపీలు ఎందుకు పట్టించుకుంటారు ? కాబట్టి ప్రశ్నలడిగిన ఎంపీలు, సమాధానాలు చెప్పాల్సిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు కచ్చితంగా పార్లమెంటుకు హాజరవ్వాల్సిందే.

వీళ్ళంతా సభకు హాజరవ్వాలంటే ప్రధానమంత్రి హాజరవ్వాలి. ప్రధాని ఉభయసభల కు హాజరవుతుంటే ఆ భయంతో మిగిలిన వాళ్ళు కూడా హాజరవుతారు. కానీ ఇక్కడ నరేంద్రమోడీయే సభలకు రారు. అలాంటపుడు ఇక ఎంపీలు హాజరవ్వాలని ఎవరు ఆదేశించాలి ? ఉభయసభల కు హాజరవ్వటం, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం నరేంద్రమోడీ బాధ్యత. అయితే మోడీ తన బాధ్యతల ను సక్రమంగా నిర్వర్తించటం లేదు. ఒకవేళ సమావేశాల కు హాజరైనా చూస్తు ఊరుకుంటారే కానీ ఏమీ మాట్లాడరు.

సభలో మాట్లాడాల్సిన విషయాల పై బయట పబ్లిక్ మీటింగ్ లోను, పార్లమెంటరీ పార్టీ మీటింగుల్లోను మాట్లాడుతారు. రాజ్యసభకు రావాల ని మోడీని ఛైర్మన్ నిర్దేశించలేకపోవచ్చు. అయితే రావాల్సిన నైతిక బాధ్యత ను గుర్తుచేయచ్చు కదా. ఆ పని కూడా తాను చేయలేనని జగదీప్ చెప్పేయటమే ఆశ్చర్యంగా ఉంది.

మణిపూర్ అల్లర్ల పై సభలో దీర్ఘకాలిక చర్చను అధికార కూటమి అంగీకరించకపోవటమే సమస్యగా మారింది. ఒకవైపు మణిపూర్ తగలబడిపోతున్నా దానిగురించి సభలో చర్చకు మోడీ అనుమతించకపోవటమే విచిత్రంగా ఉంది. మోడీని నిర్దేశించలేక, బాధ్యతలను గుర్తుచేయలేక చివరకు తమ ఆశక్తతను వ్యక్తంచేయటంతోనే ఎన్డీయే ఫెయిలైందని అర్ధమవుతోంది.