రాజ్యసభలో ఎన్డీయేకు మరింత కష్టం...వైసీపీకి షాకేనా ?
రాజ్యసభలో మొత్తం సభ్యుల బలం 245గా ఉంది. అందులో సగానికి ఒక ఓటు అదనంగా ఉంటే మ్యాజిక్ ఫిగర్ అంటారు.
By: Tupaki Desk | 27 May 2025 11:00 PM ISTరాజ్యసభలో ఇండియా కూటమి బలం అనూహ్యంగా పెరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి ఇప్పటిదాకా బొటాబొటిగా ఉన్న మెజారిటీ మరింతగా తగ్గిపోతోంది. జూన్ 19న దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలో రెండు తమిళనాడులో ఆరు రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
అసోంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ రెండు ఎంపీ సీట్లూ బీజేపీ గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలతో ఎమ్మెల్యేల సంఖ్య 45కి చేరుకుంటోంది. 42 మంది ఉంటే చాలు రాజ్యసభ ఎంపీ సీటు గెలుచుకోవడానికి. దాంతో అసోం నుంచి కాంగ్రెస్ బీజేపీ చెరొకటి గెలుచుకుంటాయని లెక్కలేస్తున్నారు.
ఇక తమిళనాడులో చూస్తే ఆరు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇక్కడ డీఎంకే నాయకత్వంలో ఇండియా కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమికి 158 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అన్నా డీఎంకే నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 75 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక్కడ రాజ్యసభ ఎంపీ గెలవడానికి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అలా ఎన్డీయే కూటమి రెండు సీట్లు గెలిస్తే ఇండియా కూటమికి నాలుగు సీట్లు దక్కుతాయి.
దాంతో మొత్తం రెండు రాష్ట్రాలు కలుపుకుని ఎనిమిది రాజ్యసభ సీట్లలో అయిదు దాకా ఇండియా కూటమి పరం అవుతాయని అంటున్నారు. దాంతో రాజ్యసభలో ఇండియా కూటమి బలం పెరుగుతుందని అంటున్నారు. రాజ్యసభలో చూసుకుంటే ఎన్డీయేకు 128 మంది సభ్యుల బలం ఉంది. ఇండియా కూటమికి 89 మంది సభ్యుల బలం ఉంది. తాజాగా ఎన్నికలు జరిగిగి కొత్త వారు నెగ్గితే ఇండియా కూటమి బలం పెరుగుతుంది. ఆ మేరకు ఎన్డీయే కూటమి బలం తగ్గుతుంది అని అంటున్నారు. అంటే 128 మంది నుంచి 125 దాకా ఎన్డీయే బలం తగ్గవచ్చు అని అంటున్నారు.
రాజ్యసభలో మొత్తం సభ్యుల బలం 245గా ఉంది. అందులో సగానికి ఒక ఓటు అదనంగా ఉంటే మ్యాజిక్ ఫిగర్ అంటారు. అంటే 123 మంది మద్దతు ఉంటే సాధారణ మెజారిటీ అని చెప్పాలి. ఎన్డీయే బొటాబొటీగా ఆ సంఖ్యకు చేరుకుంటోంది అని అంటున్నారు. ఇక ఈ రెండు కూటములలో లేని వారుగా వైసీపీ నుంచి ఏడుగురు, బీఆర్ఎస్, బీజేపీడ్, బీఎస్పీ, ఎం ఎన్ ఎఫ్ వంటి పార్టీలతో కలుపుకుని మరో ఇరవై మంది ఎంపీలు ఉన్నారు.
దీంతో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి ఎన్డీయేకు మరింత కష్టం అవుతుంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీలను మరింతమందికి ఎన్డీయే కూటమి టార్గెట్ చేస్తుందా అన్న చర్చకు తెర లేస్తోంది. అయితే 2025లో ఏపీలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు ఖాళీ అవుతాయి. అవన్నీ ఎన్డీయేకు దక్కుతాయని అంటున్నారు. చూడాలి మరి పెద్దల సభలో ఎన్డీయే ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటుందో.
