Begin typing your search above and press return to search.

మూడింట రెండొంతుల మెజార్టీ దిశగా మోడీ సర్కారు.. అదెలా?

తాజాగా శివసేన ఉద్దవ్ వర్గం ఇప్పటికే చీలిపోగా.. తాజాగా ఆ పార్టీకి చెందిన తొమ్మిది మందిలో ఆరుగురు ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి.. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు.

By:  Garuda Media   |   18 Jun 2026 12:02 PM IST
మూడింట రెండొంతుల మెజార్టీ దిశగా మోడీ సర్కారు.. అదెలా?
X

మోడీ 3.0 మీద బీజేపీ పెట్టుకున్న ఆశలు.. అంచనాలు ఇన్నిఇన్నికావు. అందుకు భిన్నంగా 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అంచనాలకు భిన్నంగా సీట్లు రావటం.. లోక్ సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఇట్టే వస్తుందన్న దానికి భిన్నంగా ఎన్డీయే కూటమి 293 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అది కూడా.. ఏపీలో టీడీపీ కూటమి భారీ ఎత్తున సీట్లను సొంతం చేసుకోవటంతో ఈ అంకె సాధ్యమైన పరిస్థితి. లోక్ సభలో మొత్తం 543 మంది సభ్యుల్లో ఎన్డీయే కూటమికి ఉన్న బలం 293 మాత్రమే.

కీలక బిల్లుల ఆమోదానికి లోక్ సభలో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమైన పరిస్థితి. అంటే.. 362 మంది సభ్యుల బలం అవసరం. ఎన్డీయేకు ఉన్న వాస్తవ బలానికి ఇది దాదాపు 69 మంది ఎంపీలు తక్కువ. సాధారణంగా అయితే.. ఈ బలాన్ని సాధించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. మోడీషాలు ప్లాన్ చేస్తే ఏమైనా జరిగిపోవాలన్నట్లుగా పరిణామాలు మారుతున్న పరిస్థితి. 2024 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిస్థితులు చూస్తే.. మోడీషా ప్లానింగ్ ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా మారుతుంది. తమకు వ్యతిరేకంగా గళం విప్పే రాజకీయ పార్టీల ఉనికి గల్లంతయ్యేలా పరిస్థితులు.. పరిణామాలు చోటు చేసుకుంటాయి.

లోక్ సభలో తమ బలాన్ని పెంచుకోవటానికి వీలుగా చేస్తున్న ప్లానింగ్ ఇప్పుడు తుదిదశకు చేరుకున్నట్లుగా చెప్పాలి. తాజాగా శివసేన ఉద్దవ్ వర్గం ఇప్పటికే చీలిపోగా.. తాజాగా ఆ పార్టీకి చెందిన తొమ్మిది మందిలో ఆరుగురు ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి.. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. అందుకు స్పీకర్ ఓకే చెప్పేశారు. తాజాగా చీలిన ఈ వర్గం శివసేన 60వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా ఏక్ నాథ్ శిండే శివసేనలో విలీనం కానుంది. ఏక్ నాథ్ షిండే బీజేపీకి బలమైన మద్దతుదారు అన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా లోక్ సభలో 37 మంది ఎంపీలు ఉన్న సమాజ్ వాదీ పార్టీలోనూ చీలిక వస్తుందని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యను యూపీకి చెందిన బీజేపీ మంత్రి ఓంప్రకాశ్ రాజ్ భర్ చేయటంతో.. చీలికకు ముహుర్తం పెట్టేశారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. సమాజ్ వాదీకి చెందిన పాతిక మంది ఎంపీలు బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. తమ పార్టీ ఐక్యంగా ఉందని.. ఇవన్నీ ఉత్త పుకార్లుగా సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు.

బీజేపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ.. బీజేపీకి చెందిన చాలామంది నాయకులే తమవైపు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. అఖిలేశ్ మాటలు నిజం కావటం చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక.. తమ లక్ష్యమైన మూడింట రెండొంతుల మెజార్టీ దిశగా మోడీషాల ప్లానింగ్ తుదిదశకు చేరుకుందని చెబుతున్నారు. తాజాగా శివసేన చీలిక వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలతో పాటు.. టీఎంసీ నుంచి వేరుపడి ఎన్సీపీఐలో చేరిన 20 మందితో కలిపితే ఎన్డీయే బలం 317కు చేరుకుంటుంది.

శివసేన ఎపిసోడ్ ముగిసిన తర్వాత శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీకి చెందిన 8 మంది ఎంపీల మీద ఫోకస్ ఉంటుందని చెబుతున్నారు. అందులో నలుగురు మద్దతు ఇచ్చినా..ఎన్డీయే బలం 321కు చేరుకుంటుంది. వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు.. ఇండిపెండెంట్లుగా ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఎన్డీయే పక్షాన నిలిచే వీలుంది. అలా చూసినా ఎన్డీయే బలం 330కు చేరుతుంది. ఇలాంటి వేళలో మూడింట రెండొంతుల బలానికి మరో 32 మంది సభ్యుల అవసరం అవుతుంది. ఈ సందర్భంగా ఎస్పీ (సమాజ్ వాదీ)లో చీలికతోపాటు.. డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు కీలకం కానున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో డీఎంకే కాంగ్రెస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇలాంటి వేళలో.. డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు కీలకమైన బిల్లుల వేళ వాకౌట్ చేస్తే.. ఎన్డీయే బలం మూడింట రెండొంతుల బలానికి చేరుకున్నట్లు అవుతుంది. తాము అనుకున్న బిల్లుల్ని పాస్ చేసుకునే అవకాశం లభిస్తుంది.