Begin typing your search above and press return to search.

రాజ్యసభలో ఎన్‌డీఏ ‘సూపర్ పవర్’.. లోక్‌సభ సంగతేంటి?

కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం పట్టుబిగిస్తోంది. ఈ నెలలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం రాజ్యసభలో సూపర్ పవర్ గా నిలిచింది.

By:  Tupaki Political Desk   |   16 Jun 2026 3:22 PM IST
రాజ్యసభలో ఎన్‌డీఏ ‘సూపర్ పవర్’.. లోక్‌సభ సంగతేంటి?
X

కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం పట్టుబిగిస్తోంది. ఈ నెలలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం రాజ్యసభలో సూపర్ పవర్ గా నిలిచింది. ఈ 12 ఏళ్లలో రాజ్యసభలో ప్రతిపక్షాలదే హవా ఉండగా, క్రమంగా తమ పార్టీ సభ్యులను పెంచుకుంటూ వచ్చిన బీజేపీ ఇప్పుడు పెద్దల సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాకుండా కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన 2/3వ వంతు మెజార్టీకి చేరువ అయింది. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికలతో పెద్దల సభలో బీజేపీతోపాటు ఎన్డీఏ బలం ప్రస్తుతం 163కి చేరింది. అంటే కీలక బిల్లుల సవరణ విషయంలో అవసరమైన 172 సంఖ్యకు కేవలం 9 స్థానాల దూరంలోనే ఉందని అంటున్నారు.

జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయంగా అజేయశక్తిగా మారుతోందని అంటున్నారు. ప్రధానంగా దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బీజేపీ.. అదే సమయంలో ప్రతిపక్షాలను ఛిన్నాభిన్నం చేయడంపై ఫోకస్ చేసిందని అంటున్నారు. దీనికి ఇటీవల రాజకీయాలను ఉదహరిస్తున్నారు. బెంగాల్ లో టీఎంసీ సంక్షోభం, పంజాబ్, ఢిల్లీలో ఆప్ ఎంపీల తిరుగుబాటు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి లాభం చేకూరుస్తోందని అంటున్నారు. ఇక రాజ్యసభలో ఎన్డీఏ తిరుగులేని మెజార్టీ సాధించడంతో కీలకమైన బిల్లుల ఆమోదంలో ప్రభుత్వం మరింత దూకుడు చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు పెద్దల సభలో చక్రం తిప్పుతున్న ఎన్‌డీఏకి లోక్‌సభలో మాత్రం 2/3 మెజారిటీ సాధించడం ఇంకా సవాల్ గానే ఉందని అంటున్నారు. అక్కడ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం కోసం 363 స్థానాలు అవసరం కాగా, ప్రస్తుతం ఎన్‌డీఏ పార్టీల చేతిలో 314 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా 49 స్థానాలు తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ వంటి కీలక మిత్రపక్షాల మద్దతుతోనే ఎన్‌డీఏ ఇక్కడ ప్రభుత్వం నడుపుతోంది. బలమైన ప్రతిపక్షం ఉండటంతో లోక్‌సభలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఎన్‌డీఏకి సాధ్యం కావడం లేదంటున్నారు. దీంతో లోక్ సభలోనూ 2/3 వంతు మెజార్టీ సాధనకు బీజేపీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు 20 మంది ఎన్డీఏతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతుండటం, తమిళనాడులో ఇండి కూటమి నుంచి డీఎంకే బయటకు రావడంతో దిగువ సభలోనూ 2/3 వంతు మెజార్టీ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని కమలనాథులు భావిస్తున్నారని అంటున్నారు.

ఈ పరిణామాలతో ఎన్‌డీఏ ఎజెండాలో ఉన్న రెండు ప్రతిష్టాత్మకమైన బిల్లులు ఆమోదానికి మార్గం సగమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా 'వన్ నేషన్ - వన్ ఎలక్షన్' బిల్లుతోపాటు మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను తాము అనుకున్న విధంగా ఆమోదింపజేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర లభిస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతోపాటు జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి పెద్దల సభలో ఎన్డీఏ సాధించిన మెజార్టీ భవిష్యత్తు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.