విధ్వంసం నుంచి వికాసం వైపు: వన్ ఇయర్ పాలనపై లోకేష్
రాష్ట్రంలో కూటమి పాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించామని చెప్పారు
By: Tupaki Desk | 12 Jun 2025 4:19 PM ISTరాష్ట్రంలో కూటమి పాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి అనేది తమ ప్రభుత్వానికి ``జోడెద్దులు`` అని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి అయిందన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందని తెలిపారు. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని చెప్పారు.
ఉద్యోగాల విషయంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. డీఎస్సీని నిలుపుదల చేసేందుకు ప్రతిపక్ష నేతలు సుమారు 24 కేసులు వేశారని, అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు. గత పదేళ్లలో రానిపెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకువచ్చామన్నారు. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని నారా లోకేష్ వివరించారు.
డొమెస్టిక్ ఇన్వెస్ట్ మెంట్స్ లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని లోకేష్ చెప్పారు. 16శాతం పెట్టు బడులు ఏపీకి వచ్చాయన్నారు. టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించామని చెప్పారు. ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం కూడా అమలు చేస్తున్నామన్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీ నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ `తల్లికి వందనం` అమలు చేస్తామని చెప్పామని ఈ హామీ ప్రకారం జీవో విడుదల చేశామని వివరించారు. 13 వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో పడతాయని, 2 వేలు పాఠశాలల్లో మెయింటెన్స్ గ్రాంట్ కింద ఖర్చు చేస్తామని వివరించారు.
