ఎన్డీయే కంచుకోట...ఇండియా కూటమితో సయ్యాట !
అలా ఈసారి అచ్చమైన ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. దీంతో ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది అన్న చర్చలు కూడా సాగాయి.
By: Tupaki Desk | 5 April 2025 7:00 AM ISTనరేంద్ర మోడీ రెండు సార్లు బీజేపీకి పూర్తి మెజారిటీ తీసుకుని వచ్చారు. ఆ సమయంలోనూ కేంద్రంలో ఎన్డీయే పేరుతోనే ప్రభుత్వం పాలన సాగింది. అయితే ఎన్డీయే అన్నది ఒక లాంచనమే. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడంతో కమలం కత్తికి ఎదురు లేకుండా పోయింది. కీలక నిర్ణయాలు అన్నీ బీజేపీ తీసుకుంటూ వచ్చింది.
బీజేపీ దూకుడుకి ఎవరూ ఏమీ బ్రేక్ వేయలేని పరిస్థితి ఉంది. ఇక ఈ ధీమా చూసుకునే 2024 ఎన్నికల్లో ఏకంగా 400 ఎంపీ సీట్లు టార్గెట్ గా బీజేపీ రంగంలోకి దిగింది. అయితే ఎన్డీయేకు 292 దాకా వచ్చాయి బీజేపీకి అయితే 240 దాకా సొంతంగా వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 272 మార్క్ కి బీజేపీ 30కి పైగా ఎంపీ సీట్ల తేడాతో అధికారానికి అవతల ఉండిపోయింది. అయితే మిత్రులుగా ఉన్న టీడీపీకి 16 ఎంపీ సీట్లు దక్కాయి. జేడీయూకి 12 సీట్లు దక్కాయి. దాంతో బీజేపీ పని సులువు అయింది.
అలా ఈసారి అచ్చమైన ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. దీంతో ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది అన్న చర్చలు కూడా సాగాయి. ఎందుకంటే మిత్రులతో కలసి ప్రభుత్వాన్ని నడపడం మోడీకి కష్టమని అంతా భావించారు. అలాగే చంద్రబాబు నితీష్ కుమార్ వంటి వారితో బీజేపీ పెద్దలు సర్కస్ ఫీట్లు చేయాల్సిందే అని అనుకున్నారు.
ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని ఇండియా కూటమి ఆదిలోనే జోస్యం వదిలింది. ఇక వీలైనప్పుడల్లా ఈ ఇద్దరూ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తారని చెబుతూ వచ్చింది. ఇక ఈ ఇద్దరికీ అలాంటి పరిస్థితే వచ్చింది ఒక విధంగా అగ్ని పరీక్ష లాంటిది వచ్చింది. అదే వక్ఫ్ బిల్లు.
ఈ బిల్లును చట్టం చేయాలన్నది బీజేపీ పెద్దల ఆలోచన. అయితే ముస్లిం ఓటు బ్యాంక్ అని మధ్యేవాద పార్టీలుగా నితీష్ కుమార్ జేడీయూ చంద్రబాబు టీడీపీ ఆశలు పెట్టుకుంటాయి కాబట్టి అవి కచ్చితంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తాయని ఇండియా కూటమి పెద్దలు భావించారు. మరో వైపు చూస్తే దేశంలోని పెద్ద ముస్లిం సమ్ష్తలు కూడా ఈ రెండు పార్టీలను ఎన్డీయేకు సపోర్టు చేయవద్దని ఈ బిల్లుని వ్యతిరేకించమని డిమాండ్ చేశాయి.
అదే గొంతుకతో ఇండియా కూటమి నేతలు కూడా ఈ రెండు పార్టీల మీద తీవ్ర ఒత్తిడి పెట్టాయి. అయితే ఈ రెండు పార్టీలూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇండియా కూటమి ఆశలను ఆవిరి చేశాయి. అంతే కాదు బిల్లులోని కొన్ని కీలక సవరణలు చేసి మరీ ముస్లిం సమాజంలోని మహిళలు పేదలకు తాము దగ్గర అని చాటి చెప్పుకున్నాయి.
ఈ బిల్లులోని మంచి అంశాలను పార్లమెంట్ సాక్షిగా చెప్పి మరీ తాము ఎందుకు మద్దతు ఇస్తున్నామో బాగా సమర్ధించుకున్నాయి. ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు అలాగే మహిళలకు పూర్తి న్యాయం చేకూరుతుంది అన్న అంశాన్ని గట్టిగా ప్రచారంలో చేయడంతో ఈ రెండు పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఇక ఈ బిల్లు చట్టం కావడం వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండదని బలంగా చెప్పగలిగాయి.
అదే విధంగా ఈ రెండు పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవడమే కాకుండా వారు చెప్పిన సవరణలను ఆమోదించడం ద్వారా మోడీ ప్రభుత్వం సమయస్పూర్తిని ప్రదర్శించింది. అలా ఇండియా కూటమిని దెబ్బతీయగలిగింది. ఇప్పటప్పట్లో ఎన్డీయే కూటమికి బీటలు వారే సూచనలు లేవని అయిదేళ్ళూ ఈ కూటమి పటిష్టంగా అధికారంలో ఉంటుందని కూడా వక్ఫ్ బిల్లు ద్వారా చెప్పగలిగాయి.
మరో వైపు చూస్తే ఇండియా కూటమి పార్టీలు మైనార్టీ వాదంతో మెజారిటీలకు దూరం అవుతున్నాయా అన్న చర్చ కూడా వచ్చింది. అలాగే మైనారిటీల వైపు అని చెబుతూ అందులోని పేదలను మహిళలను పట్టించుకోవడం లేదు అన్న నిందను కూడా మోస్తున్నాయని అంటున్నారు. ఆ విధంగా ఆయా పార్టీల ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ని ఎన్డీయే ఎక్స్ పోజ్ చేయగలిగింది అని అంటున్నారు.
