కూటమికి ఏడాది: బాబు రియాక్షన్ ఇదే!
గత ఏడాది ఇదే రోజు (జూన్ 12) రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.
By: Tupaki Desk | 12 Jun 2025 4:19 PM ISTఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీల కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది ఇదే రోజు (జూన్ 12) రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నామని ఆయన తెలిపారు. అదేసమయంలో ఈ ఏడాది కాలంలో అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను ఎదురొడ్డి.. పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టామన్నారు. పేదల సేవలో.., సామాజిక భద్రతా పెన్షన్లు, పేదలకు రూ.5కే అందించే అన్న క్యాంటిన్లు, ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా ఇచ్చే దీపం-2, అదేవిధంగా అమ్మలకు రూ.15000 చొప్పున ఇచ్చే తల్లికి వందనం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
ఈ నెలలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. అదేవిధంగా నిరుద్యో గుల ఆశలను నెరవేర్చేందుకు మెగా డీఎస్సీతో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు సీఎం చెప్పారు. పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేస్తున్నామన్నారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇక, సాగు నీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చెప్పారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టామని వివరించారు. విశాఖ రైల్వే జోన్ సాధించడంతోపాటు... విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించామని చెప్పారు. ``మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం`` అని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
