మోడీ తరువాతనే బాబు కూడా...లిస్ట్ పెరుగుతోంది !
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మార్పులు చేర్పులు ఏపీకి సంబంధించి దక్కే అవకాశాలు సామాజిక రాజకీయ ప్రాంతీయ సమీకరణలు ఇవన్నీ చూసుకుని బీఅరీజు వేసుకోవడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.
By: Satya P | 11 July 2026 9:23 AM ISTకేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలకు రెండేళ్ళ పాలన పూర్తి అయిపోయింది. దీంతో ఒక విధంగా చెప్పాలీ అంటే ఒక కీలక దశకు ప్రభుత్వాలు చేరుకున్నాయి. మరో రెండేళ్ళు మాత్రమే సమయం ఉంది. ఆ చివరి ఏడాది ఎన్నికలకు వదిలేస్తే ఏమి చేసినా ఏమి చెప్పినా ఈ కీలక సమయమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అతి ముఖ్యంగా మారుతోంది. దాంతో ఏపీలో కేంద్రంలో కూడా ప్రభుత్వాల పనితీరు గీటు రాయిగా మారనుంది. గతం ఎలా ఉన్నా ఇపుడు విపక్షాలు కూడా జోరు పెంచడంతో ధీటుగా ప్రభుత్వం నుంచి వాయిస్ ఉండాలి. అదే సమయంలో తమ శాఖలలో పనితీరు కూడా జోరు పెంచాలి. ప్రజలకు ఫలితాలు అందాల్సిన సందర్భం ఇది. దాంతో కేంద్రంలో మంత్రి వర్గ పునర్ వ్వవస్థీకరణకు కేంద్ర పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. గత కొంత కాలంగా దీని మీద చర్చ అయితే సాగుతోంది. అలాగే ఏపీ విషయంలో కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం ఉంది.
మోడీ మొదట కదిలిస్తేనే :
ఇక ఎక్కడ ముందు ఎక్కడ తరువాత అంటే మోడీయే ముందు అని అంటున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మార్పులు చేర్పులు ఏపీకి సంబంధించి దక్కే అవకాశాలు సామాజిక రాజకీయ ప్రాంతీయ సమీకరణలు ఇవన్నీ చూసుకుని బీఅరీజు వేసుకోవడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఈసారి ఏపీ నుంచి ఒకటి రెండు అదనపు బెర్తులకు చాన్స్ ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రమోషన్స్ ఉంటాయని శాఖల మార్పుతో ఏపీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఏపీలో చూస్తే ఉత్తరాంధ్రా కోస్తా రాయలసీమ వంటి మూడు రీజియన్లు ఉన్నాయి. వీటిలో కేంద్ర మంత్రి వర్గంలో ఎవరికి అవకాశం దక్కింది అన్నది చూసుకుని మరీ ఏపీలో మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు.
ఈసారి సీమకు ప్రయారిటీ :
మరో వైపు చూస్తే రాయలసీమకు ఈసారి ప్రాధాన్యత కేంద్ర మంత్రి వర్గంలో ఉండొచ్చు అని అంటున్నారు. యూపీయే ప్రభుత్వం హయాంలో సీమ నుంచి కేంద్ర మంత్రులు ఉండేవారు. టీడీపీ కూటమి వచ్చాక 2024లో కేంద్ర మంత్రి పదవులలో ఉత్తరాంధ్రా గోదావరి కోస్తా వారికే చాన్స్ లభించింది. రాయలసీమకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అలాగే మహిళా కోటా కూడా భర్తీ కాలేదు. దాంతో పాటు ఒకటి రెండు బలమైన సామాజిక వర్గాలకు కూడా చోటు దక్కలేదని అంటున్నారు. ఈసారి ఆ లోటు భర్తీ అవుతుందని చెబుతున్నారు. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ సెప్టెంబర్ లో ఉంటుందని చెబుతున్నారు. అంటే మరో రెండు నెలల పాటు వాయిదా పడింది అని అంటున్నారు.
అక్టోబర్ లో ఏపీలో :
ఈ క్రమంలో ఏపీలో మంత్రివర్గంలో మార్పు చేర్పులు అక్టోబర్ లో జరగవచ్చు అని అంటున్నారు. ముందు అనుకున్న దాని ప్రకారం చూస్తే జూలైలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటే ఏపీలో ఆగస్టులో ఉంటుందని భావించారు. కానీ ఇపుడు వాయిదా పడినట్లే అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వాయిదా వల్ల ఆశావహులు అక్కడా ఇక్కడా కూడా బాగానే పెరుగుతారని అంటున్నారు. ఏపీలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో పాటుగా ఎంపీలు 21 మంది ఉన్నారు. ఇలా చాలా ఎక్కువ మంది గెలవడం అందులో అత్యధికులు కేబినెట్ బెర్తుల మీద ఆశలు పెట్టుకోవడంతో ఈసారి మార్పులు చేర్పులు ఎక్కడ ఎవరు చేసినా కత్తి మీద సాముగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి అమాత్య కిరీటం అందుకునే అదృష్టవంతులు ఎవరో.
