Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు.. ఏపీ నుంచి ముగ్గురికి చాన్స్?

ఈ విస్తరణలో దాదాపు 60 శాతానికి పైగా మంత్రుల శాఖలు మార్చనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా పలువురు సీనియర్లను మంత్రులుగా తప్పించి వేరే బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   2 Jun 2026 6:00 PM IST
కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు.. ఏపీ నుంచి ముగ్గురికి చాన్స్?
X

కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోందనే వార్తలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని, ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఈ మార్పులు చేర్పులు ఉండవచ్చని బీజేపీ ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విస్తరణలో దాదాపు 60 శాతానికి పైగా మంత్రుల శాఖలు మార్చనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా పలువురు సీనియర్లను మంత్రులుగా తప్పించి వేరే బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా కేబినెట్ విస్తరణపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు మంత్రి పదవులను కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుత కేబినెట్‌లోని ఐదారుగురు కేబినెట్ మంత్రులతో పాటు దాదాపు 12 మంది సహాయ మంత్రులను నుంచి తప్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా 2014, 2019 నుంచి నిరంతరాయంగా మంత్రి పదవుల్లో కొనసాగుతున్న వారిలో కొందరిని పక్కన పెట్టి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుత విద్యుత్‌ శాఖ మంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్‌, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లతో రాజీనామా చేయించి, వారిని గవర్నర్లుగా పంపించే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీడీపీకి మరో చాన్స్..

కేంద్రంలో ఎన్డీయే కూటమికి అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కేబినెట్‌లో మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి కింజరాపు రామ్మోహననాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, తాజా సమీకరణాల నేపథ్యంలో టీడీపీ నుంచి మరొకరికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు జనసేన పార్టీకి కేబినెట్‌లో చోటు దక్కబోతోందనే ప్రచారం ఊపందుకుంది. మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవి అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

పురందేశ్వరికి లైన్ క్లియర్!

ఇక తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు లేదా నలుగురికి మంత్రి పదవులను ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీకి కచ్చితంగా ఒక మంత్రి పదవి కేటాయించనుండగా, జనసేన, బీజేపీ నుంచి మిగిలిన పదవుల భర్తీ ఉంటుందని చెబుతున్నారు. అయితే బీజేపీ నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయమై తీవ్ర తర్జనభర్జన సాగుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఉండగా, నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు పురందేశ్వరి కూడా రేసులోకి వచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలనే ఆలోచనతో ఉన్న హైకమాండ్ ఆ రాష్ట్రానికి చెందిన నేతల పేర్లను పరిశీలిస్తోందని చెబుతున్నారు. దీంతో రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పేరుపై కొంత అస్పష్టత కొనసాగుతోందని అంటున్నారు. అయితే ఆమెకు ఉన్న అనుభవం, సమర్థతను దృష్టిలో పెట్టుకుని మహిళా కోటాలో ప్రమోషన్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

కూటమి వైపే మోడీ మొగ్గు

వచ్చే ఎన్నికలు, రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పనితీరు ఆధారంగానే మంత్రుల మార్పిడి ఉంటుందని, అదే సమయంలో ప్రాంతీయంగా బలంగా ఉన్న మిత్రపక్షాలను మరింత సంతృప్తి పరచడం ద్వారా ఎన్డీయే కూటమిని ఐదేళ్ల పాటు మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పునర్వ్యవస్థీకరణ సాగనుందని స్పష్టమవుతోంది. ఈ నెల 20 తర్వాత ఏ క్షణంలోనైనా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం.