కేబినెట్ బెర్తులలో వారికీ చోటు.. మిత్రులకు తగ్గుతాయి !
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ళ తరువాత మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం చేస్తోంది.
By: Satya P | 19 July 2026 9:59 AM ISTకేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ళ తరువాత మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధం చేస్తోంది. నిజానికి ఈ పాటికే మంత్రి వర్గంలో భారీ మార్పులు చేర్పులు కూడా జరిగిపోయి ఉండాలి. కానీ బీజేపీ చాణక్య వ్యూహాలతో అది కాస్తా వాయిదా పడింది. బీజేపీకి వర్షాకాల సమావేశాలు చాలా ముఖ్యం. ఈ సమావేశాలలో బీజేపీ అనేక కీలకమైన బిల్లులను ఆమోదించుకోవాల్సి ఉంది. అవన్నీ రాజ్యాంగ సవరణకు సంబధించిన బిల్లులే కావడం విశేషం. దాంతోనే బీజేపీ మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. అందుకే ముందు దాని మీదనే ఫోకస్ పెట్టింది అని అంటున్నారు.
బలం పెంచుకుంటూనే :
ఇక ఏప్రిల్ 17న బీజేపీ లోక్ సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. ఓట్ల తేడా చూస్తే ఏకంగా 64 దాకా వచ్చింది. దాంతో ఆనాటి నుంచే రాజ్యాంగ సవరణకు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ తన దృష్టిని పూర్తిగా పెట్టేసింది. అయితే బీజేపీ ప్రయత్నాలు కూడా బాగానే ఫలించాయని చెప్పుకోవాలి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది దాకా లోక్ సభ ఎంపీలు వేరు పడ్డారు. రాజ్యసభలో అయితే టీఎంసీ ఎంపీలు ముగ్గురు బీజేపీలో చేరిపోయారు. అలాగే ఏక్ నాథ్ షిండే శివసేనలో ఉద్ధవ్ థాక్రే ఎంపీలు ఆరుగురు చేరిపోయారు. ఇలా చూస్తే ఒక్కసారిగా బలం 26 కి పెరిగింది. అంటే నంబర్ 298 నుంచి 324 దాకా బీజేపీకి వచ్చేసినట్లే అయింది. ఇక శరద్ పవార్ ఎన్సీపీ నుంచి ఎనిమిది మంది ఎంపీల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు మద్దతు ఇస్తేఅ కనుక 334కి బలం చేరుకుంటుంది. డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు లోక్ సభలో జై కొడితే అది కాస్తా 356 అవుతుంది. ఈ లెక్కన ఒక ఆరుగురి బలం మాత్రమే తగ్గుతుంది. అయినా సరే బీజేపీ లెక్కలు దానికి ఉన్నాయని అంటున్నారు.
కేంద్రంలో పదవులు :
ఇక తృణమూల్ కాంగ్రెస్ నుంచి అయినా లేదా ఉద్ధవ్ థాక్రే నుంచి వేరు పడిన ఆరుగురు ఎంపీలు అయినా శరద్ పవార్ ఎన్సీపీ అయినా కూడా కేంద్రంలో బెర్తుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు. తృణమూల్ చీలిక వర్గానికి కనీసంగా అయిదుగురు దాకా ఎంపీలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కి రెండు, ఎన్సీపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. అంటే ఇక్కడే దాదాపుగా పది మంత్రి పదవులు కేబినెట్ లో కొత్తగా కేటాయించాల్సి ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్డీయే మిత్రులుగా ఉన్న పార్టీల విషయంలో ఉన్న మంత్రి పదవులకి ఏ ఇబ్బంది లేకపోయినా కొత్తగా పదవులు అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే మాట వినిపిస్తోంది.
కీలక భేటీ కోసం :
ఇదిలా ఉంటే ఈ నెల 21న ఎన్ డీయే మిత్ర పక్షాలతో కీలకమైన భేటీ ప్రధాని అధ్యక్షతన జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ మీదనే చర్చ సాగుతుందని అంటున్నారు. అలాగే కీలక బిల్లులను ఆమోదించుకునే విషయంలోనూ అంతా ఏకతాటి మీద ఉండాలన్న దాని మీద కూడా ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఇక కీలక బిల్లులు కనుక రాజ్యాంగ సవరణ జరిగి పార్లమెంట్ లో ఆమోదం పొందితే ఆ మీదట కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని బహుశా ఆగస్టు చివరి వారంలో అయినా లేదా సెప్టెంబర్ లో అయినా ఉండవచ్చు అని అంటున్నారు. మొత్తానికి ఎన్ డీయేకు మద్దతు పెరగడం మిత్ర పక్షాల కేబినెట్ బెర్త్ లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది చూడాల్సిందే.
