పెరగనున్న బీజేపీ బలం... మిత్రులకు తకరారు !
మూడవసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు కానీ అది బీజేపీ సొంత బలంతో ఏ మాత్రం కాదు.
By: Satya P | 9 Jun 2026 7:00 AM ISTమూడవసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు కానీ అది బీజేపీ సొంత బలంతో ఏ మాత్రం కాదు. బీజేపీ 2024 ఎన్నికల్లో 240 స్థానాలను గెలుచుకుంది. దీంతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ 543 స్థానాలున్న లోక్‌సభలో 272 స్థానాల మెజారిటీ మార్కును చేరుకోలేకపోయింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్లు తక్కువ అయ్యాయన్న మాట. దాంతో బీజేపీకి ఏపీలోని తెలుగుదేశం పార్టీ 16 ఎంపీలు అలాగే బీహార్ లోని జేడీయూకి చెందిన 12 ఎంపీలు ప్రాణ వాయువుగా మారాయి. అలా ఇతర చిన్న పార్టీలు తన మిత్రపక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో ఈ కూటమి మొత్తం 293 స్థానాలకు మెల్లగా చేరువ అయింది. మరి బీజేపీకి ఆ మిగిలిన 53 సీట్లూ కూడా మిత్రుల వల్లనే దక్కాయన్నది వాస్తవం.
సీన్ మారుతోంది :
ఇదిలా ఉంటే కేంద్రంలోనూ జాతీయ రాజకీయాల్లోనూ మెల్లగా సీన్ మారుతోంది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ విజయం ఇపుడు డబుల్ బొనంజాగా ఆ పార్టీకి మారబోతోంది. అక్కడ 208 సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 50 మంది ఎమ్మెల్యేల చీలిక సైతం కలిసి వచ్చేలా ఉంది. అదే సమయంలో 28 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలలో భారీ చీలిక వస్తోంది. అందులో ఏకంగా 23 మంది వేరు కుంపటి పెట్టేశారు. వారంత తాజాగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో ఢిల్లీలో వీరంతా పాల్గొనడం అయితే మమతా బెనర్జీకి బిగ్ షాక్ గా ఉంది. అంతే కాదు వీరంతా కూడా పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో కూడా టచ్ లో ఉన్నారు.
ప్రత్యేక వర్గంగా :
వీరంతా ప్రత్యేక వర్గంగా తమను పార్లమెంట్ లో గుర్తించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను రేపో మాపో కలిసి కోరబోతున్నారు. అలా తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొదట వేరు పడడం అన్న కీలక ఘట్టం స్టార్ట్ కానుంది. ఆ మీదట వీరంతా కలసి బీజేపీలో విలీనం కావడం లాంచనమే అని అంటున్నారు. అంటే బీజేపీకి లోక్ సభలో ఇపుడు ఉన్న బలం 240 కి ఈ 23 మంది కలిస్తే ఏకంగా 263 నంబర్ కి చేరుకుంటుంది. మరి మ్యాజిక్ ఫిగర్ ని చేరువ కావడానికి మరో తొమ్మిది మంది మాత్రమే తక్కువ ఉంటారు అన్న మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేమంత కష్టం కాదు అన్నది కూడా హస్తిన రాజకీయాల్లో వినిపించే మాట.
మిత్రులకు షాకేనా :
ఇక గత రెండేళ్ళలో మిత్రులకు బీజేపీ ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీల మద్దతుతో సాగుతోంది కాబట్టి. అయినా సరే చాలా నిర్ణయాలలో బీజేపీదే పైచేయిగా ఉంటూ వచ్చింది. అంతే కాదు కీలక శాఖల విషయంలో కూడా బీజేపీ తన వద్దనే ఉంచుకుంటూ వస్తోంది. అలాగే గవర్నర్ పోస్టుల విషయమో కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ బీజేపీ మాటే గెలుస్తోంది. ఇక కీలకమైన బిల్లుల విషయంలోనూ మిత్రులను తన మాటే వినేలా ఇప్పటికే బీజేపీ చేసుకుంది. మిత్ర పక్ష పార్టీలకు వారి రాష్ట్రాలలో నిధులు ఇచ్చే విషయంలో కూడా పెద్దగా ఉదారత అయితే లేదు, కానీ గతంతో పోలిస్తే కొంత మేలు అన్నదే ఉంది. అయితే ఇపుడు ఆ మాత్రం ఉదారత కానీ వెసులుబాటు కానీ ఉండదా అన్నదే చర్చగా ఉంది.
అలెర్ట్ కావాల్సిందే :
ఇక చూస్తే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కేంద్రంలో మరో మూడేళ్ళ పాటు అధికారం ఉంది. రానున్న రోజుల్లో తమిళనాడు డీఎంకే విషయంలోనూ ఈ తరహా ప్రయోగాలు చేస్తే ఆ పార్టీకి ఉన్న 35కి పైగా ఉన్న ఎంపీలలో చీలిక తెచ్చినా కూడా బీజేపీకి మరింత బలం వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ బలంగా లోక్ సభలోనే కాదు రాజ్యసభలోనూ మారుతోంది. ఆ పార్టీ ఎంపీల నంబర్ గణనీయంగా పెరగనుంది. దాంతో మిత్రులే కాదు పరోక్షంగా బీజేపీకి హెల్ప్ చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ లాంటి పార్టీలు కూడా అలెర్ట్ కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
