వైసీపీకి ఎమ్మెల్యే నజీర్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే?
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ విపక్ష వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 4 Aug 2025 5:47 PM ISTగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ విపక్ష వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫొటోను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాసలీలలు అంటూ వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో అసలదేనని నిరూపించాలని సవాల్ విసిరారు. 20 ఏళ్లుగా టీడీపీ గెలవని సీట్లో తాను గెలిచానని, తన విజయాన్ని జీర్ణించుకోలేని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ రాసలీలలు అంటూ వైసీపీ పోస్టు చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. టీడీపీకే చెందిన ఓ మహిళా నేతతో ఎమ్మెల్యే అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆ పోస్టులో ఆరోపించింది. అయితే బాధితురాలు నేరుగా ఎమ్మెల్యేపై ఫిర్యాదు లేదా ఆరోపణలు చేయకపోయినా వైసీపీ ఆ వీడియో బయట పెట్టడం రాజకీయంగా సంచలనం రేపింది. కొద్ది రోజులుగా ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న రాజకీయ దాడిని తప్పించుకునే అస్త్రంగా ఈ వీడియోను మలుచుకుంది వైసీపీ.
అయితే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాత్రం వైసీపీ పోస్టు చేసిన వీడియో ఫేక్ అంటూ ఎదురుదాడికి దిగారు. ధైర్యం ఉంటే ఆ వీడియో నిజమేనని నిరూపించాలని సవాల్ విసిరారు. వైసీపీ వీడియోను పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్పందించారు. దీంతో ఈ వివాదం గుంటూరు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సవాల్ ను వైసీపీ స్వీకరిస్తుందా? లేదా? అన్నది ఎదురు చూడాల్సివుంది. ఈ వ్యవహారంలో ఇంత వివాదం జరుగుతున్నా బాధితురాలు మాత్రం బయటకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే నుంచి వేధింపులు ఎదురవుతుంటే మహిళా నేత మౌనంగా ఉండటానికి కారణమేంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఎమ్మెల్యేకు బయపడే ఆమె నోరు విప్పలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి వైసీపీ పోస్టు చేసిన వీడియో రాజకీయంగా కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
