Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ గేమ్స్ లో నష్టం.. పాక్ గుఢచర్యంతో భర్తీ!!

తెర వెనుక మాతృభూమికి వెన్నుపోటు పొడుస్తూ.. తెరముందు భారత్ మాతాకీ జై అనే బ్యాచ్ వ్యవహారం ఇటీవల కాలంలో ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Jun 2025 10:16 AM IST
ఆన్ లైన్ గేమ్స్ లో నష్టం.. పాక్ గుఢచర్యంతో భర్తీ!!
X

తెర వెనుక మాతృభూమికి వెన్నుపోటు పొడుస్తూ.. తెరముందు భారత్ మాతాకీ జై అనే బ్యాచ్ వ్యవహారం ఇటీవల కాలంలో ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ల అనంతరం భారత్ చేపట్టిన ఇంట్లోని ఎలుకల హంటింగ్ లో పలువురు బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మరొ నేవీ ఉద్యోగి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అవును... ఇటీవల ముగిసిన ఆపరేషన్ సిందూరు సహా పలు సున్నితమైన కార్యకలాపాల సమయంలో పాకిస్తాన్ హ్యాండ్లర్‌ కు రక్షణ సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలతో దేశ రాజధానిలోని నేవీ హెడ్ క్వార్టస్ లో ఉద్యోగం చేస్తున్న న్యూఢిల్లీకి చెందిన ఓ క్లర్క్ ను రాజస్థాన్ సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు పాక్ ఐ.ఎస్.ఐ. కోసం పనిచేస్తున్నాడని అంటున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... హర్యానాకు చెందిన విశాల్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఢిల్లీలోని నేవల్‌ కార్యాలయంలో క్లర్క్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అతడి అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించారు రాజస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు. ఈ క్రమంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం.. అతడి ఫోన్‌ ను స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా.. ఇండియన్ నేవీతో పాటు ఇతర రక్షణ దళాలకు చెందిన చాలా సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌ కు చెందిన ఓ మహిళా హ్యాండ్లర్‌ కు చేరవేసినట్లు తెలిసిందని అంటున్నారు. ఆమె నుంచి డబ్బులు తీసుకొని కీలక సమాచారం చేరవేసినట్లు గుర్తించారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన రాజస్థాన్‌ సీఐడీ ఐజీ విష్ణుకాంత్‌ గుప్తా... పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి చెందిన ఓ మహిళతో విశాల్‌ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తాము గుర్తించామని తెలిపారు. ఇందులో భాగంగా... ప్రియా శర్మగా పరిచయం చేసుకున్న సదరు పాక్‌ హ్యాండ్లరు విశాల్‌ కు డబ్బు ఆశ చూపి రహస్య సమాచారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇదే సమయంలో... ఆన్‌ లైన్‌ గేమ్స్‌ కు బానిసగా మారి డబ్బులు పోగొట్టుకున్న విశాల్‌ యాదవ్‌.. ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తున్నట్లు ఐజీ ఇవిష్ణుకాంత్‌ పేర్కొన్నారు.