Begin typing your search above and press return to search.

నవీన్ యాదవ్ కు మంత్రి పదవి..? కాంగ్రెస్ లెక్కలు ఇంట్రెస్టింగ్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జాక్ పాట్ కొట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   16 Nov 2025 2:00 AM IST
నవీన్ యాదవ్ కు మంత్రి పదవి..? కాంగ్రెస్ లెక్కలు ఇంట్రెస్టింగ్
X

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జాక్ పాట్ కొట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ను మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. పక్కా హైదరాబాదీ, బీసీ, యువత, సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు.. ఇలా అనేక కోణాల్లో నవీన్ ను మంత్రి పదవి వరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి చెందిన వారు మంత్రివర్గంలో లేరని, ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ హైదరాబాదీ అయినా ఆయన మైనార్టీ కోటాలో చేరతారని అంటున్నారు. నవీన్ యాదవ్ ను మంత్రివర్గంలో చేర్చుకుంటే రానున్న రోజుల్లో హైదరాబాద్ లో బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, ఇదే విషయాన్ని ఆయన పార్టీ హైకమాండ్ తో చర్చిస్తున్నారని చెబుతున్నారు.

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెనుకబడిన వర్గాలకు చెందిన బలమైన సామాజికవర్గం. ఆయన బంధువర్గానికి కూడా నగరంలో రాజకీయంగా బలమైన నేపథ్యం ఉంది. యువకుడు, విద్యావంతుడైన నవీన్ యాదవ్ ను మంత్రిని చేస్తే పార్టీకి భవిష్యత్తులో అన్ని రకాలుగా కలిసివస్తుందనే అంచనాలు వేస్తున్నారు. దీంతో అన్ని కోణాల్లో నవీన్ యాదవ్ ను మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో అధిష్టానం ఆలోచిస్తోందని అంటున్నారు. 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక్కస్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. దీనికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడమే అని అంటున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ రూపంలో ఆ కొరత తీరడంతో ఆయనకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్ నగరంపై పట్టు సాధించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు.

జీహెచ్ఎంసీతోపాటు నగరం చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లతో కలుపుకుని చూస్తే.. దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలో 17 నియోజకవర్గాలు వస్తున్నాయి. అయితే లోకల్ లీడర్ కు సరైన అధికారాలు అప్పగిస్తే భవిష్యత్తులో నగరం విస్తరించిన 30 నియోజకవర్గాల్లో పార్టీని బలపేతం చేయొచ్చని సీఎం భావిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో యువతను బీసీలను ప్రోత్సహించాలని సీఎం ఆలోచనగా ఉందని అంటున్నారు. అందుకే గతంలో రాజ్యసభ సభ్యత్వాన్ని యువకుడైన అనిల్ కుమార్ యాదవ్ కు కట్టబెట్టారు. ఇప్పుడు నవీన్ యాదవ్ ను ఎమ్మెల్యే గెలిపించడం, మంత్రిని చేయడం ద్వారా హైదరాబాద్ లో దూసుకుపోవాలని సీఎం లెక్కలు వేస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే చెందిన అజారుద్దీన్ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నందున నవీన్ యాదవ్ కు కూడా అమాత్య పదవి ఎలా? అని కొందరు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అయితే అజారుద్దీన్ పదవికి.. నవీన్ యాదవ్ కి ఎటువంటి సంబంధం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి మద్దతుదారులు చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయని, అదేసమయంలో మంత్రివర్గంలో ఉన్న కొందరిని తప్పించి పునర్వ్యవస్థీకరించాలని సీఎం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారని అంటున్నారు. కాకపోతే ఇంతవరకు సరైన సమయం రాలేదని సీఎం వెనక్కి తగ్గారని, ఇక జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత దూసుకుపోవాలని నిర్ణయించారని అంటున్నారు. తన ఆలోచనను అధిష్టానం పెద్దలతో పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చేనెల 7వ తేదీ రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం పెట్టాలని నిర్ణయించారని అంటున్నారు. ఆ సమయంలో నవీన్ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.