జపాన్ బుల్లెట్ ట్రైన్ ముందు భాగం పొడవు ఎందుకుంటుందో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జపాన్ పర్యటన సందర్భంగా బుల్లెట్ రైలులో ప్రయాణించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ అందరి దృష్టి పడింది.
By: Tupaki Desk | 31 Aug 2025 2:00 AM ISTప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జపాన్ పర్యటన సందర్భంగా బుల్లెట్ రైలులో ప్రయాణించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ అందరి దృష్టి పడింది. ముంబయి–అహ్మదాబాద్ మధ్య మొదలుకానున్న హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌కు ఇది మార్గదర్శకంగా నిలుస్తోంది. కానీ నేడు ప్రపంచంలో అత్యంత విశ్వసనీయంగా పేరొందిన జపాన్ బుల్లెట్ రైళ్లు గతంలో పెద్ద సమస్యను ఎదుర్కొన్నాయి. ఆ సమస్యను పరిష్కరించినది మానవ ఇంజనీరింగ్ కాకుండా, ప్రకృతిలోని ఒక చిన్న పక్షి – కింగ్‌ఫిషర్.
సౌండ్ పొల్యూషన్ తో అవాంతరాలు..
1964లో టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా జపాన్ తన తొలి బుల్లెట్ రైలు సేవను ప్రారంభించింది. టోకైడో-షింకన్‌సెన్ కారిడార్ అప్పటినుంచే ప్రపంచంలో అత్యంత రద్దీగా మారింది. అయితే, ఈ రైళ్లు గంటకు 300 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్నప్పుడు ఒక పెద్ద సమస్య తలెత్తింది. ట్రైన్ సొరంగం నుంచి బయటకు వస్తూనే తుపాకీ పేలుడు మాదిరి శబ్దం వినిపించేది. ఇది 70 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉండడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యతో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు అవాంతరాలు తప్పవని అంతా భావించారు.
ప్రకృతి నుంచి ప్రేరణ
ఈ సమయంలో రైల్వే ఇంజనీర్ ఈజీ నకాట్సు ఒక విభిన్న దారిని అన్వేషించారు. ఆయన సహజసిద్ధంగా పక్షులపై ఆసక్తి కలిగిన వ్యక్తి. కింగ్‌ఫిషర్ నీటిలోకి దూకే తీరు ఆయనను ఆకట్టుకుంది. ఆ పక్షి పొడవైన ముక్కు కారణంగానే నీటిని చీల్చుకుంటూ ఎటువంటి పెద్ద శబ్దం చేయకుండా లోపలికి వెళ్తుందనే విషయం ఆయన గమనించారు. అదే సూత్రాన్ని ట్రైన్ రూపకల్పనలో అమలు చేశారు.
ముక్కు ఆకృతిలో...
దీంతో బుల్లెట్ రైలుకు పక్షి ముక్కు ఆకారంలో పొడవైన ముందు భాగాన్ని రూపొందించారు. ఈ మార్పు వల్ల శబ్ద కాలుష్యం తగ్గడమే కాకుండా, రైలు ఇంధన సామర్థ్యం మెరుగుపడింది. స్థిరత్వం కూడా పెరిగి, గంటకు 320 కి.మీ. వేగాన్ని సురక్షితంగా సాధించగలిగింది.
ఈ రూపకల్పన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌ను కాపాడడమే కాకుండా, ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలో ‘ప్రకృతి నుంచి ప్రేరణ’ పొందిన గొప్ప ఉదాహరణగా నిలిచింది
