Begin typing your search above and press return to search.

బాబు అరెస్ట్... వారందరినీ వాయించివదిలిన నట్టి కుమార్!

ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఎందుకు అనే చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 3:57 AM GMT
బాబు అరెస్ట్... వారందరినీ వాయించివదిలిన  నట్టి కుమార్!
X

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఎందుకు అనే చర్చ మొదలైంది. తాజాగా ఈ విషయంపై నిర్మాత నట్టికుమార్ తనదైన శైలిలో స్పందించారు.

అవును... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నుంచి లబ్ది పొందిన వాళ్లు ఈ సమయంలో ఆయనకు అండ లేకుండా పోయారు అని సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ ను కూడా ఖండించలేదని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు చంద్రబాబు ఎంతో చేశాడని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ సహా అశ్వినీదత్, ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, చిరంజీవి, ప్రభాస్, రాఘవేంద్రరావు, సురేష్ బాబు, మురళీ మోహన్ ఖండించకపోవడం బాధగా ఉందని.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నుంచి లబ్ది పొందినవారే ఇప్పుడు నోరు మెదపడం లేదని నట్టి కుమార్ అన్నారు.

ఇదే క్రమంలో... తాను మొదటి నుంచీ కాంగ్రెస్ వాదినని చెప్పుకున్న నట్టికుమార్... తెలుగుదేశం పార్టీకి ఏరోజూ తాను సపోర్ట్ చేయలేదని, అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్‌ ను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు. అదేవిదంగా తుమ్మల ఇంటి పేరును నందమూరి లాగా ఫీలయ్యే నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ కూడా స్పందించలేదని నట్టికుమార్ తనదైన శైలిలో స్పందించారు.

ఈ సందర్భంగా మరింత ఫైరయిన నట్టికుమార్... పరిశ్రమలో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు ఎక్కువ అనే పేరుందని, వీళ్లంతా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు మాత్రం అవికావాలి ఇవి కావాలని లబ్ది పొందిన వారే అని అన్నారు. ప్రతీ సందర్భంలోనూ సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారని తెలిపారు.

అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండటం మానవత్వం అని తెలిపిన నట్టికుమార్... చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే వైఎస్ జగన్ ఏమన్నా ఉరితీస్తారా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో వెనకాల నుంచి ముసుగు వేసుకుని బయటకు కనిపించకుండా సపోర్ట్ చేసేవాళ్లు దొంగలు.. ముందుండి మద్దతు ఇచ్చిన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ నట్టి కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

దీంతో నట్టికుమార్ అసలు ఇన్ టెన్షన్ ఏమిటనే సంగతి కాసేపు పక్కనపెడితే ఆయన స్పందించిన విధానం, ప్రస్థావించిన విషయాలు మాత్రం హైలైట్ అని అంటున్నారు నెటిజన్లు.

కాగా... ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను 14 రోజుల రిమాండ్‌ పై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు.