Begin typing your search above and press return to search.

జాతీయ రాజకీయాలు : కేసీయార్ చంద్రబాబులకు అచ్చిరాలేదా...?

జాతీయ రాజకీయాల్లో రాణించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే దక్షిణాదిన చాలా మంది ప్రతిభావంతులైన నాయకులు ఉన్నారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 9:30 AM GMT
జాతీయ రాజకీయాలు :  కేసీయార్ చంద్రబాబులకు అచ్చిరాలేదా...?
X

జాతీయ రాజకీయాల్లో రాణించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే దక్షిణాదిన చాలా మంది ప్రతిభావంతులైన నాయకులు ఉన్నారు. గతంలో చూస్తే ఎన్టీయార్ దక్షిణాదిన తెలుగుదేశం పార్టీని పెట్టి ఉమ్మడి ఆంధ్రాలో తిరుగులేని నాయకత్వం అందించారు. ఆ మీదట ఆయన జాతీయ రాజకీయాల వైపు తొంగి చూశారు.

ఎంతో మంది జాతీయ విపక్ష నాయకులను ఎంటీయార్ ఆంధ్రాకు రప్పించి వారితో రాజకీయ సమావేశాలు సభలు నిర్వహించారు. ఒక దశలో భారతదేశం పేరుతో పార్టీని ఏర్పాటు చేయాలని కూడా ఎన్టీయార్ తీవ్రంగా ఆలోచన చేశారు. అయితే అది కాస్తా నేషనల్ ఫ్రంట్ గా రూపాంతరం చెందింది. ఎన్టీయార్ రెండవసారి అంటే 1985లో ముఖ్యమంత్రి కాగానే పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలలో తలమునకలు అయ్యారు.

అలా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కి ఆయన చైర్మన్ గా వ్యవహరించారు. 1989 డిసెంబర్లో లోక్ సభకు ఏపీకి కూడా ఎన్నికలు వచ్చాయి. ఎన్టీయార్ మాత్రం జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టి నేషనల్ ఫ్రంట్ కి ప్రచారం చేయడం ఏపీలో తామే తప్పకుండా గెలుస్తామని భావించడం వల్ల ఉమ్మడి ఏపీలో ఆనాడు టీడీపీ ఓటమి పాలు అయింది. ఎన్టీయార్ కూడా కల్వకుర్తిలో రెండవ సీటుగా పోటీ చేసి స్వయంగా ఓడిపోయారు.

ఇక ఆయన మళ్లీ సర్దుకుని కేవలం ఏపీ మీదనే ఫోకస్ పెట్టడంతో 1994లో మళ్లీ మూడవసారి సీఎం గా చాన్స్ వచ్చింది. బంపర్ మెజారిటీతో టీడీపీ నెగ్గింది. ఆ తరువాత చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన కూడా యునైటెడ్ ఫ్రంట్ అన్నది కేంద్రంలో ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. దానికి కన్వీనర్ గా కూడా వ్యవహరించారు. ఆ ఫ్రంట్ పనులలో బాబు ఏపీ మీద దృష్టి కొంత తగ్గించారు.

ఇక 1999 తరువాత ఎన్డీయే కూటమిలో చేరి దానికి కన్వీనర్ గా కూడా బాబు పనిచేశారు. ఇలా జాతీయ రాజకీయాల్లో బాబు కీలక పాత్ర పోషిస్తున్న నేపధ్యంలోనే ఉమ్మడి ఏపీలో 2004లో ఆయన అధికారాన్ని పోగొట్టుకున్నారు. రెండు విడతలుగా బాబు ఓటమి పాలు అయ్యారు. చివరికి 2014లో విభజన ఏపీకి ఆయన సీఎం అవగలిగారు.

అదే విధంగా 2019 ఎన్నికలకు ముందు కూడా బాబులో మరోసారి జాతీయ రాజకీయాల మీద కోరిక ఏర్పడింది.ఆయన కాంగ్రెస్ ఇతర పక్షాలతో కలసి దేశమంతా తిరిగారు. ప్రచారం చేసి పెట్టారు. చివరికి చూస్తే మరోసారి బీజేపీ అధికారంలోకి కేంద్రంలో వచ్చింది. బాబు ఏపీలో కూడా ఓటమి పాలు అయ్యారు. ఈ విధంగా చూస్తే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తహతహలాడిన ప్రతీసారి బాబు ఇబ్బందులే పడ్డారు అని అర్ధం అవుతోంది.

ఇక కేసీయార్ వంతు అన్నట్లుగా పరిస్థితి ఉంది. కేసీయార్ నిజానికి 2019 ఎన్నికల వేళకే మూడవ ఫ్రంట్ ని ఏర్పాటు చేయాలని చూశారు. అయితే అప్పటికి లోక్ సభ ఎన్నికలు తక్కువ వ్యవధిలో ఉండడంతో పాటు తెలంగాణాలో కూడా బీయారెస్ కి తక్కువ ఎంపీలు రావడంతో ఆయనకు అలా బ్రేక్ పడింది. పైగా బీజేపీ కేంద్రంలో వచ్చింది.

ఇక 2023లో మళ్లీ తెలంగాణాలో గెలిచి హ్యాట్రిక్ సీఎం కావాలని 2024 నాటికి జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని కేసీయార్ తలపోస్తూ వచ్చారు. దానికి తగినట్లుగానే ఆయన తన టీయారెస్ పార్టీని బీయారెస్ గా మార్చారు. గత రెండేళ్ళుగా ఆయన దేశమంతా తిరిగారు. అనేక రాష్ట్రాలలో విపక్ష నాయకులను కలసి మంతనాలు జరిపారు.

ఇక తెలంగాణాలో తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. దాంతో ఫోకస్ అయితే కొంత సొంత రాష్ట్రంలో తగ్గింది అని అంటున్నారు. దాని ఫలితమే తాజాగా లభించిన భారీ ఓటమి అని కూడా చెబుతున్నారు. ఇలా చంద్రబాబు కానీ కేసీయార్ కానీ ఇద్దరూ కూడా జాతీయ రాజకీయాల మీద మోజు పడి ఎంత చేసినా కూడా బొక్క బోర్లా పడడం తప్ప దక్కింది శూన్యమని అంటున్నారు.

హిందీ రాష్ట్రాలలో సౌతిండియా వారి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టకుండా తమ పని తాము చేసుకుని పోయే నాయకులు తమిళనాట కనిపిస్తారు. డీఎంకే అయినా అన్నాడీఎంకే అయినా కూడా తమిళనాడు వదిలి బయటకు రారు. అవసరం అయితే జాతీయ నేతలనే తమ వద్దకు రప్పించుకుంటారు. కానీ తెలుగు రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు మాత్రం జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉబలాటంతో ఎప్పటికపుడు బోల్తా పడుతూనే ఉంటారు అన్నది మళ్లీ మళ్లీ రుజువు అవుతోంది.