Begin typing your search above and press return to search.

సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు.. హైవేల మీద పాదచారులు తిరగొద్దు

ప్రజావాజ్యం వేసేందుకు ప్రయత్నించిన ఒక పిటిషన్ ను విచారణకు తిరస్కరిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

By:  Tupaki Desk   |   21 Nov 2023 10:34 AM IST
సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు.. హైవేల మీద పాదచారులు తిరగొద్దు
X

ప్రజావాజ్యం వేసేందుకు ప్రయత్నించిన ఒక పిటిషన్ ను విచారణకు తిరస్కరిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జాతీయ రహదారుల మీద పాదచారులు తిరగకూడదని పేర్కొంది. హైవేల మీద పాదచారుల భద్రత అంశాన్ని లేవనెత్తుతూ ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం పరిశీలించింది.

అసలు హైవేల మీదకు పాదచారులు ఎలా వస్తారన్న ప్రశ్నను లెవనెత్తుతూ.. 'వారికి క్రమశిక్షణ ఉండాలి. వారు హైవేల మీద తిరగకూడదు. ప్రపంచంలో ఎక్కడా ఇలా తిరిగే వ్యక్తులు కనిపించరు. భవిష్యత్తులో పాదచారుల కోసం హైవేలపై వాహనాల్ని ఆపాలని కూడా కోరుతారు. అదెలా సాధ్యం? ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని కోర్టు ఎలా సమర్థిస్తుంది' అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది.

హైవేల మీద పాదచారుల భద్రతను ప్రస్తావిస్తూ దాఖలైన పిటీషన్ ను పరిశీలించిన సుప్రీం.. ఇది పూర్తిగా అసంబద్ధమైన పిటీషన్ అని పేర్కొనటం గమనార్హం. హైవేలపై పాదచారులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయని పిటిషన్ దారుల తరఫున లాయర్లు వాదించగా.. పాదచారులు ఉండకూడని చోట ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

దేశంలో హైవేలు పెరిగాయి కానీ క్రమశిక్షణ మాత్రం పెరగలేదన్న సుప్రీం.. సదరు పిటిషన్ దారు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'అసలు ఈ పిటిషన్ మీద జరిమానా విధించాలి. ఏదేమైనా సంబంధిత మంత్రిత్వ శాఖను సంప్రదించే ముందు హైకోర్టుమీకో అవకాశం ఇచ్చింది' అని పేర్కొంది. వాస్తవానికి పిటిషన్లు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై కేంద్ర రోడ్డురవాణా రహదారుల శాఖనుసంప్రదించాలని తెలిపింది. అయితే.. గుజరాత్ హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణ వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. పిటిషన్ ను కొట్టేసింది.