దేశంలో కుల గణన ఎందుకు.. అసలు అది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా ?
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన వాదనను తెర మీదకు తెచ్చింది.
By: Tupaki Desk | 30 April 2025 4:53 PMదేశంలో కులగణనకు సంబంధించి మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్రం తెలిపింది. నేడు కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాబోయే జాతీయ జనగణనలో కుల గణనను కూడా నిర్వహించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ బుధవారం ఈ మేరకు ఆమోదం తెలిపింది. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా, కుల గణన చేపట్టాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్,ఇతర ప్రతిపక్ష పార్టీల నోర్లు మూయించే ప్రయత్నంగా కూడా దీనిని భావించవచ్చు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన వాదనను తెర మీదకు తెచ్చింది. దివంగత ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2010లోనే కుల గణన అంశాన్ని కేబినెట్‌లో చర్చించాలని సూచించినప్పటికీ కాంగ్రెస్ ఎప్పుడూ దీనిని వ్యతిరేకిస్తూ వచ్చిందని ఆరోపించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వయంగా వచ్చే జనగణనలో కుల గణనను ప్రారంభిస్తామని ప్రకటించింది. మరి దేశంలో కుల గణన గతంలో ఎప్పుడు, ఎలా జరిగింది? ఈ కథనంలో తెలుసకుందాం.
భారతదేశంలో జనగణన 1881లో బ్రిటిష్ పాలనలో ప్రారంభం అయింది. అప్పటి నుండి దేశ జనాభా లెక్కలను అందించడానికి ప్రతి పదేళ్లకోసారి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జనగణన ముఖ్య ఉద్దేశ్యం దేశంలోని సామాజిక, ఆర్థిక, మత, జనాభా స్వరూపాన్ని అర్థం చేసుకోవడం. ఈ ప్రక్రియ 1948 నాటి జనగణన చట్టం ప్రకారం నిర్వహిస్తారు. దీని ప్రకారం సేకరించిన మొత్తం డేటా రహస్యంగా ఉంచుతారు.
ఈ నేపథ్యంలోనే సామాజిక-ఆర్థిక, కుల గణన (SECC) ప్రారంభమైంది. 1931లో మొదటిసారిగా కుల ఆధారిత జనగణన జరిగింది. అయితే, ఆధునిక SECC మొదటిసారిగా 2011లో నిర్వహించారు. దీని ఉద్దేశం దేశంలోని ప్రతి గ్రామీణ, పట్టణ కుటుంబానికి చేరుకుని వారి సామాజిక, ఆర్థిక స్థితి గురించి సమాచారాన్ని సేకరించడం. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను గుర్తించడానికి, వారికి ప్రయోజనకరమైన పథకాలను అందించడానికి వీలవుతుంది. జనగణన దేశంలోని మొత్తం జనాభా వివరాలను అందిస్తే, SECC వెనుకబడిన ప్రజల వివరాలను అందిస్తుంది.
సంఖ్యల్లో కులాలు:
1872: బ్రాహ్మణ, క్షత్రియ, రాజపుత్; వృత్తి ఆధారంగా ఇతర కులాలు, స్థానిక క్రైస్తవులు, ఆదివాసీ తెగలు, అర్ధ-హిందూ తెగలుగా విభజించారు.
1901: 1,642 కులాలు
1931: 4,147 కులాలు
1941: రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా జనగణనలో కోత విధించారు.
2011: సామాజిక-ఆర్థిక, కుల గణన సంఖ్యలను తప్పుల కారణంగా నిలిపివేశారు. 46 లక్షలకు పైగా కులాల పేర్లు, ఉపకులాలు, ఇంటిపేర్లు, గోత్రాలున్నాట్లు కనుగొన్నారు.