Begin typing your search above and press return to search.

ఆరుగురు టీం లీడర్లు అరెస్టు.. నాసిక్ ఐటీ కంపెనీలో అసలేమైంది?

ఈ ఉదంతాన్ని అత్యంత అరుదైన.. షాక్ కు గురి చేసేదిగా చెప్పొచ్చు. అసాధారణంగా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు

By:  Garuda Media   |   10 April 2026 4:28 PM IST
ఆరుగురు టీం లీడర్లు అరెస్టు.. నాసిక్ ఐటీ కంపెనీలో అసలేమైంది?
X

ఈ ఉదంతాన్ని అత్యంత అరుదైన.. షాక్ కు గురి చేసేదిగా చెప్పొచ్చు. అసాధారణంగా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఈ కేసులోని సున్నిత అంశాలు పెద్ద ఎత్తున ఉండటంతో మొత్తం వివరాలు వెల్లడించకపోవటం కూడా కొద్దిపాటి కన్ఫ్యూజన్ కు గురి చేసేలా ఉంది. ఏమైనా.. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాన్ని మాత్రం విన్నదే కాదు చూసింది లేదు కూడా.

ఇంతకూ అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని నాసిక్ లోని ఒక బహుళజాతి ఐటీ కంపెనీకి చెందిన ఆరుగురు టీం లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టులు జరగటం ఒక ఎత్తు అయితే.. ఇదే కంపెనీకి చెందిన మహిళా హెచ్ ఆర్ మేనేజర్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.

ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే.. నాసిక్ లోని ఒక మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో దాదాపు 300 మందికి పైనే ఉద్యోగులు పని చేస్తున్నారు. తాజాగా ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు షాకిచ్చేలా ఉండటమే కాదు.. సంచలనంగా మారింది. ఈ ఎనిమిది మంది ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తం 9 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు.

2022 నుంచి తమపై లైంగిక వేధింపులతో పాటు.. మతపరమైన దూషణలు.. మత మార్పిడి ఒత్తిడి చేయటం లాంటి చేష్టలతో తమను తీవ్రంగా వేధించినట్లుగా వారు పేర్కొన్నారు. తమను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేయటం లాంటివి చేసినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. ఈ కేసును లోతుగా విచారించేందుకు పోలీసు కమిషనర్ సందీప్ కర్ణిక్ ఆదేశాల మేరకు సిట్ ను ఏర్పాటు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో.. వారు జరిపిన ప్రాథమిక విచారణలో మరో షాకింగ్ నిజం వెలుగు చూసింది. బాధితులు గతంలో కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ కు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఐటీ కంపెనీ ఒక పెద్ద బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లేదంటే టెక్నాలజీ సర్వీసెస్ కు చెందిన సంస్థగా చెబుతున్నారు. ఇప్పటివరకు అరెస్టు అయిన ఆరుగురు టీం లీడర్ల వివరాల్ని చూస్తే..

- ఆసిఫ్ అన్సారీ

- షఫీ షేక్

- షారుక్ ఖురేషీ

- రజా మేమన్

- తౌసిఫ్ అత్తార్ తోపాటు మరొకరు ఉన్నారు.

ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మంది మహిళలతో పాటు ఒక పురుషుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కేసు విచారణ సాగే కొద్దీ బాధితుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధిత మహిళలంతా 18-25 ఏళ్ల లోపు వారే కావటం గమనార్హం. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టం 2013 కింద బాధితులు ఫిర్యాదు చేసినా.. కంపెనీ హెచ్ ఆర్ మేనేజర్ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

బాధితుల ఫిర్యాదులో తమపై అనుచిత శారీరక వేధింపులు జరిగినట్లుగా వారు వెల్లడించారు. తమ శరీరం.. దుస్తుల గురించి అభ్యంతరక వ్యాఖ్యలు చేసేవారని పేర్కొన్నారు. అదే పనిగా తమ మతాన్ని లక్ష్యంగా చేసుకొని పదే పదే దూషించేవారని కూడా బాధితులు వెల్లడించటం షాక్ కు గురి చేసేలా మారింది. ఇప్పుడు అన్నింటి కంటే షాకింగ్ ఏమంటే.. ఒక మల్టీ నేషనల్ఐటీ కంపెనీలో ఆరుగురు టీం లీడర్లు.. హెచ్ ఆర్ మేనేజర్ మొత్తం ఒకే వర్గానికి చెందిన వారు కావటం.. బాధితులంతా మరోవర్గానికి చెందిన వారు కావటం విస్మయానికి గురి చేస్తోంది.

ఈ నేపథ్యంలో అసలు కంపెనీ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఏంటి? ఇలా ఒకే వర్గానికి చెందిన ఆరుగురు టీం లీడర్లు ఎలా అయ్యారు? మహిళా హెచ్ ఆర్ మేనేజర్ బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తున్నారు. అరుదైనదిగా పేర్కొంటున్న ఈ ఉదంతం మీద మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాల్ని చూసినప్పుడు ఒక నిందితుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడని.. అతనికి అప్పటికే పెళ్లైనా.. ఆ విషయాన్ని దాచి పెట్టినట్లుగా ఒక బాధితురాలు పేర్కొన్నారు.

మరో బాధితురాలి ఫిర్యాదులో మతపరమైన మనోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడటం.. ఒక పురుష ఉద్యోగి బలవంతంగా మతపరమైన ప్రార్థనలు చేయాలని ఒత్తిడికి పాల్పడినట్లుగా పేర్కొంటున్నారు. తమపై కంప్లైంట్ చేస్తే తమకున్న పవర్ తో బాధితుల కెరీర్ నాశనం చేస్తామని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేసినట్లుగా పేర్కొన్నారు. ఒక బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం తనకు ఎదురైన వేధింపుల గురించి ఈ మొయిల్ ద్వారా కంప్లైంట్ చేస్తే.. సదరు మహిళా హెచ్ఆర్ మేనేజర్ స్పందిస్తూ.. ఎంఎన్ సీలో ఇలాంటివి సాధారణమేనని.. కూల్ గా ఉండాలన్న సలహా ఇచ్చినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

సంచలనంగా మారిన ఈ ఉదంతంలో భారత శిక్షాస్మ్రతి సెక్షన్ 295ఏ కు సమానంగా ఉన్న ప్రస్తుత భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ సెక్షన్ 295ఏ ఏం చెబుతుందన్నది చూస్తే.. ‘‘ఏదైనా ఒక వర్గం లేదా సమూహం యొక్క మతపరమైన నమ్మకాలను, వారి మతాన్ని లేదా దేవుళ్లను ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా కించపరచడం ద్వారా ఆ వర్గం వారి మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఇది శిక్షిస్తుంది’’ అని చెబుతుంది.

ఈ సెక్షన్ కింద కేసు నమోదై.. న్యాయ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే.. నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక కోర్టు నిందితుల్లో ఐదుగురిని విచారించి.. వారిని ఏప్రిల్ 10 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఆరోపణలు ఉన్న ప్రధాన నిందితుడు మాత్రం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. నాసిక్ లోని సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా హెచ్ ఆర్ మేనేజర్ ను పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణలకు తగ్గట్లు ఆధారాలు లభిస్తే ఆమెను కూడా కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని చెబుతుననారు. ఈ రోజు (ఏప్రిల్ 10) నిందితుల కస్టడీని పొడిగించాలా? లేదా? అన్నది కోర్టు నిర్ణయిస్తుందని చెబుతున్నారు.