Begin typing your search above and press return to search.

49 ఏళ్లుగా ఆగని ప్రయాణం.. వోయేజర్-1 సృష్టించనున్న చరిత్ర!

నాసా 1977లో ప్రయోగించిన వోయేజర్-1 వ్యోమనౌక నవంబర్ 18న భూమికి ఒక కాంతి రోజు దూరాన్ని చేరుకోనుంది. అంటే దాదాపు 25.9 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం గంటకు 61 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ నౌకతో భూమికి ఇంకా సంబంధాలు కొనసాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Nov 2026 9:58 AM IST
49 ఏళ్లుగా ఆగని ప్రయాణం.. వోయేజర్-1 సృష్టించనున్న చరిత్ర!
X

భూమి నుంచి ఎప్పుడో వెళ్లిన ఓ చిన్న అంతరిక్ష నౌక ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దాని పేరు వోయేజర్-1. 1977లో నాసా పంపిన ఈ వ్యోమనౌక ఇప్పుడు భూమికి ఒక కాంతి రోజు దూరంలోకి వెళ్లబోతోంది. నవంబర్ 18న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:46 గంటలకు ఈ మైలురాయిని చేరుకుంటుందని అంచనా.

కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరాన్ని కాంతి రోజు అంటారు. ఇది దాదాపు 25.9 బిలియన్ కిలోమీటర్లు. ఇంత దూరం ప్రయాణించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా వోయేజర్-1 నిలవనుంది.

1977 సెప్టెంబర్ 5న ప్రయాణం మొదలుపెట్టిన ఈ వ్యోమనౌక.. బృహస్పతి, శని గ్రహాలను దాటి ఇప్పుడు సౌర వ్యవస్థకు ఆవల కొనసాగుతోంది. గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా, భూమితో సంబంధాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీని నుంచి పంపే సమాచారం మనకు చేరడానికి దాదాపు 24 గంటలు పడుతుంది.

వోయేజర్-1లో ఉన్న మరో ప్రత్యేక వస్తువు గోల్డెన్ రికార్డు. ఇందులో భూమికి సంబంధించిన చిత్రాలు, సంగీతం, ప్రకృతి శబ్దాలు, 55 భాషల్లో పలకరింపులు ఉన్నాయి. ఎప్పుడైనా గ్రహాంతర జీవులకు ఈ నౌక కనిపిస్తే భూమి గురించి తెలుసుకోవాలన్నది దీని వెనుక ఉద్దేశం.

ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ నవంబర్ 17న సూర్యాస్తమయం తర్వాత ఫోన్ లైట్లు లేదా టార్చిలైట్లు వెలిగించాలని నాసా ప్రజలను కోరింది. మోర్స్ కోడ్‌లో V-G-R అక్షరాలను ఫ్లాష్ చేస్తూ వోయేజర్-1 ప్రయాణంలో ప్రజలు కూడా భాగం కావచ్చు.