నాసా నైట్ మ్యాప్: అంతరిక్షం నుండి చూస్తే బీహార్ ఎందుకు అలా వెలిగిపోతోంది?
ఈ గ్లోబల్ నైట్ మ్యాప్‌లో భారత దేశంలోని `యుపి-బీహార్ బెల్ట్` భూమిపై ఉన్న అత్యంత ప్రకాశవంతమైన ప్రాంతాలలో ఒకటిగా కనిపించడం విశేషం.
By: Sivaji Kontham | 20 April 2026 4:00 AM ISTనాసా తాజాగా విడుదల చేసిన భూమి రాత్రి వేళ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ గ్లోబల్ నైట్ మ్యాప్‌లో భారత దేశంలోని `యుపి-బీహార్ బెల్ట్` భూమిపై ఉన్న అత్యంత ప్రకాశవంతమైన ప్రాంతాలలో ఒకటిగా కనిపించడం విశేషం. సాధారణంగా వెనుకబడిన రాష్ట్రంగా చర్చల్లో ఉండే బీహార్ అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీ పడుతూ అంతరిక్షం నుండి ఇంత ధేధీప్యమానంగా వెలిగిపోతుండటం చూసి ఇంటర్నెట్ లోకం విస్మయం చెందుతోంది. సుయోమి ఎన్ పిపి ఉపగ్రహం ద్వారా తీసిన ఈ క్లౌడ్-ఫ్రీ ఫోటోలు ఆ ప్రాంతపు కాంతి తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
ఈ అద్భుతమైన వెలుగుల వెనుక ప్రధానంగా ఇండో-గాంజిటిక్ మైదాన ప్రాంతంలోని జనసాంద్రత కీలక పాత్ర పోషిస్తోంది. గంగా నదీ పరివాహక ప్రాంతంలో గ్రామాలు, పట్టణాల మధ్య దూరం తక్కువగా ఉండటం వల్ల విద్యుత్ వెలుగులు విడివిడిగా కాకుండా ఒక సుదీర్ఘమైన గొలుసులా కనిపిస్తున్నాయి. ఢిల్లీ నుండి కోల్‌కతా వరకు విస్తరించి ఉన్న ఈ బెల్ట్ ప్రపంచంలోని ఇతర మెట్రో నగరాల కంటే ఉత్తమంగా మెరుస్తుండటం విశేషం. జనాభా ఎక్కువగా ఉన్న చోట కాంతి వనరులు కూడా సహజంగానే అధికంగా ఉండటంతో అంతరిక్షం నుండి ఇది ఒక వెలుగుల సముద్రంలా దర్శనమిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా బీహార్.. ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన వేగవంతమైన గ్రామీణ విద్యుదీకరణ ఈ మార్పుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణం-వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలు నేడు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. చిన్న గ్రామాలు సైతం క్రమంగా పట్టణీకరణ చెందుతుండటం వల్ల రాత్రి సమయ వెలుగుల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇది ఒక రకంగా ఆయా ప్రాంతాల్లో చోటుచేసుకున్న సామాజిక మార్పుకు .. విస్తరిస్తున్న విద్యుత్ నెట్‌వర్క్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. రాత్రి వేళ కనిపించే వెలుగులను కేవలం కాంతిగా మాత్రమే కాకుండా.. ఆ ప్రాంతపు ఆర్థిక కార్యకలాపాలకు.. అభివృద్ధికి ఒక సూచికగా పరిగణించవచ్చు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది. కొందరు దీనిని బీహార్ సాధించిన అద్భుత ప్రగతిగా అభివర్ణిస్తుంటే.. మరికొందరు ఇది కేవలం అధిక జనాభా వల్ల ఏర్పడిన దృశ్య ప్రభావం మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదైనా.. ప్రపంచ పటంలో భారతదేశం ఇంత ప్రకాశవంతంగా కనిపించడం చూస్తుంటే భారతీయులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.
అయితే, ఈ వెలుగుల జిలుగుల వెనుక పర్యావరణ కోణాన్ని కూడా విస్మరించలేమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధిక కాంతి వల్ల కలిగే కాంతి కాలుష్యం జీవవైవిధ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే అంతరిక్షం నుండి బీహార్ ప్రాంతం ఇంతటి వైభవంతో కనిపించడం అనేది మన దేశ మౌళిక సదుపాయాల ఎదుగుదలకు, విస్తరిస్తున్న విద్యుత్ వెలుగులకు ఒక బలమైన సాక్ష్యం. భవిష్యత్తులో ఈ వెలుగులు మరింత నాణ్యమైన జీవన ప్రమాణాలకు దారితీయాలని ఆశిద్దాం.
