Begin typing your search above and press return to search.

న‌ర్సీప‌ట్నంలో నువ్వా-నేనా.. ఓ రేంజ్‌లో వార్ ..!

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నంలోని నర్సీపట్నం నియోజకవర్గంలో రాజ‌కీయ‌ పరిస్థితి ఎలా ఉంది.. వైసీపీ వర్సెస్ టిడిపి మధ్య రాజకీయాలు ఎలా కొనసాగుతున్నాయి అనేది ఆసక్తిగా మారింది.

By:  Garuda Media   |   30 April 2026 6:00 AM IST
న‌ర్సీప‌ట్నంలో నువ్వా-నేనా.. ఓ రేంజ్‌లో వార్ ..!
X

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నంలోని నర్సీపట్నం నియోజకవర్గంలో రాజ‌కీయ‌ పరిస్థితి ఎలా ఉంది.. వైసీపీ వర్సెస్ టిడిపి మధ్య రాజకీయాలు ఎలా కొనసాగుతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ యాక్టివ్ గా పని చేస్తున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల మధ్యకు కూడా వస్తున్నారు. అంతేకాదు పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ఇటీవల కాలంలో నిర్వహించిన పలు నిరసన కార్యక్రమాల్లో కూడా పెట్ల పాల్గొంటున్నారు.

అయితే ఆశించిన విధంగా నియోజకవర్గంలో ఉమాశంకర్ గ్రాఫ్ అయితే పెద్దగా పెరగడం లేదనేది స్థానికంగా వైసిపి నాయకుల మధ్య చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణం టిడిపి సీనియర్ నాయకుడు, ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు చేస్తున్న రాజకీయమేన‌ని అని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు బలమైన వాయిస్ వినిపిస్తుండడంతో పాటు నియోజకవర్గంలో గట్టిపట్టును కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. స్థానికంగా తన కుమారుడు విజయ్ సైతం కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఏ పని అయినా పక్కా వ్యూహంతో చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనికి తోడు వైసీపీ చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా స్పీకర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వైసిపి చేస్తున్న రాజకీయాలకు దీటుగా ఇక్కడ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే `నువ్వా నేనా` అన్నట్టుగా నర్సీపట్నం నియోజకవర్గం మారిపోయింది. 2019 ఎన్నికల్లో ఉమాశంకర్ గణేష్ విజయం సాధించినప్పటికీ గత ఎన్నికలకు వచ్చేసరికి ఆయన తన సానుకూల ఓటు బ్యాంకు ని పోగొట్టుకున్న పరిస్థితి కనిపించింది.

దీంతో గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి ఒకింత పుంజుకునే దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారు. కానీ, చింతకాయల ఫ్యామిలీ నుంచి బలమైన పోరు నడుస్తోంది. బలమైన పోటీ ఇచ్చే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమాశంకర్‌కు ఏ మేరకు ఇక్కడ సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి అనేది చూడాలి. ప్రస్తుతం అయితే హోరాహోరీగా ఇరుపక్షాల మధ్య రాజకీయం సాగుతోంది.

అంతేకాదు సామాజిక వర్గాలపరంగా కూడా ఇరువర్గాలు దూకుడుగానే వ్యవహరిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ పరిస్థితులు ఎలా మారుతాయి అన్నది చూడాలి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రంగంలోకి దించేందుకు అయ్యన్నపాత్రుడు ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్టు టిడిపి నాయకులు చెబుతున్నారు. దీంతో అయ్య‌న్న మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఆయ‌న రాజ‌కీయాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.