Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు మీద మోడీ సంచలన వ్యాఖ్యలు...!

ప్రధాని నరేంద్ర మోడీ ఎపుడూ విమర్శలు విపక్షాల మీదనే చేస్తూ ఉంటారు. అందులోనూ కాంగ్రెస్ మీదనే ఆయన విమర్శలు ఎక్కువగా ఉంటాయి

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:13 PM GMT
సుప్రీంకోర్టు మీద మోడీ సంచలన వ్యాఖ్యలు...!
X

ప్రధాని నరేంద్ర మోడీ ఎపుడూ విమర్శలు విపక్షాల మీదనే చేస్తూ ఉంటారు. అందులోనూ కాంగ్రెస్ మీదనే ఆయన విమర్శలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నికలు వస్తే మాత్రం ఆయా రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలను అసలు విడిచిపెట్టకుండా తీవ్ర వ్యాఖ్యలే చేస్తారు.

పదేళ్ళ జాతీయ రాజకీయాల్లో మోడీ ఈ విధంగానే మాట్లాడటం విమర్శలు చేయడం అంతా చూసారు. అలాంటి మోడీ ఉన్నట్లుండి సుప్రీం కోర్టు మీద పరోక్షంగా అయినా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎపుడూ రాజ్యాంగ వ్యవస్థల మీద మోడీ ఈ తరహా కామెంట్స్ చేసి ఎరగరు. కానీ తాజాగా యూపీ పర్యటనలో మాత్రం మోడీ సుప్రీంకోర్టు మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ రోజులలో ఈ యుగంలో సుధాముడు భగవాన్ శ్రీకృష్ణుడికి బియ్యం ఇచ్చినా కూడా దాని మీద వెంటనే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు అవుతుంది, ఆ మీదట శ్రీకృష్ణుడు అవినీతి చేశారు అని తీర్పు కూడా వస్తుంది అని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

మోడీ ఎందుకు ఇలా మాట్లాడారు అని అంతా అనుకునే పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఎవరు ఇచ్చినా అది క్విడ్ ప్రోకో అవుతుందని అభిప్రాయపడినట్లుగా వార్తలు వచ్చాయి. ఒకవేళ ఎవరు ఎంత విరాళం ఇచ్చారు అన్నది బాహాటం చేయాలని కూడా తీర్పులో పేర్కొన్నారు.

ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ ని ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం. అధికంగా విరాళాలు అందుకుంటున్నది కూడా ఆ పార్టీనే. ఒక విధంగా సుప్రీంకోర్టు తీర్పు నేరుగానే బీజేపీని ఆ పార్టీ పెద్దలకు తగులుతుంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

మరో వైపు చూస్తే దేశంలోని విపక్షాలు కూడా ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో తీవ్ర విమర్శలు చేశాయి. దాని మీద సుప్రీంకోర్టులో పిల్ దాఖలు అయి విచారణ నడిచి తీర్పు వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయం మీద సుప్రీం తీర్పుని హర్షించాయి. బీజేపీ స్పందన ఏమిటో తెలియరాలేదు అని అంటున్నారు. మరి ఇపుడు చూస్తే మోడీ చేసిన కామెంట్స్ దాని గురించేనా అన్నది ఒక సందేహం అయితే ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో బీజేపీ తన విధానం కరెక్ట్ అని అనుకుంటోందా అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది.