Begin typing your search above and press return to search.

ఇది క‌దా.. రాజ‌కీయం అంటే, మోడీ రేపుతున్న మ‌రో దుమారం!

ఇప్పుడు దీనిని మ‌రింత వివాదం చేసేలా పీఎం మోడీ అనుస‌రిస్తున్నారు. వచ్చేనెల మార్చి 6వ తేదీన ప్ర‌ధాన మంత్రి ప‌శ్చిమ బెంగాల్ కు వెళ్ల‌నున్నారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 6:30 AM GMT
ఇది క‌దా.. రాజ‌కీయం అంటే, మోడీ రేపుతున్న మ‌రో దుమారం!
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వ్య‌వ‌హారం మ‌రోసారి రాజ‌కీయ దుమారానికి దారితీసేలా క‌నిపిస్తోంది. రాష్ట్రాల విష యంలోనే కాదు.. రాష్ట్రాల్లోజ‌రుగుతున్న ప‌రిణామాల విష‌యంలోనూ ఆయ‌న అనుస‌రిస్తున్న‌తీరు..తీవ్ర వివాదంగా మారే ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌డుతోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల విష‌యంలో ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల రాష్ట్రాల్లో అనుస‌రిస్తున్న విధానం మ‌రో ర‌కంగా ఉంటోద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు దీనిని మ‌రింత వివాదం చేసేలా పీఎం మోడీ అనుస‌రిస్తున్నారు. వచ్చేనెల మార్చి 6వ తేదీన ప్ర‌ధాన మంత్రి ప‌శ్చిమ బెంగాల్ కు వెళ్ల‌నున్నారు.

వెళ్తే త‌ప్పేంట‌ని అనుకోకండి. ఇక్క‌డే ఉంది.. అస‌లు రాజ‌కీయం. గ‌త కొన్ని రోజులుగా బెంగాల్‌ రాష్ట్రం లోని 24 ఉత్త‌ర ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఉన్న‌ సందేశ్‌ఖాలీ గ్రామంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో బాధితులుగా ఉన్న మహిళలను ఆయ‌న ప‌రామ‌ర్శించనున్నారు. వారికి ధైర్యం చెప్ప‌నున్నారు. అనంత‌రం.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మహిళల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో ప్ర‌ధాని మోడీ పాల్గొంటారు. ఇదే తీవ్ర వివాదాని కి, రాజ‌కీయ భోగి మంట‌ల‌కు కార‌ణం కానుంది. ఇక్క‌డ ప‌ర్య‌టించ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ రాష్ట్రానికి పొరుగునే ఉన్న ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లోనూ రిజ‌ర్వేష‌న్ల ర‌గ‌డ కార‌ణంగా.. బాధితులైన మ‌హిళ‌లు ఉన్నారు. వారిని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాని మోడీ ప‌న్నెత్తిప‌ల‌క‌రించలేదు. ఇప్పుడు ఇవీ.. కీల‌క‌వ్య‌వ‌హారం.

మ‌ణిపూర్‌లో ప‌రిస్థితులు ఇంకా గాడిన‌ ప‌డ‌లేదు. అంతేకాదు.. అస‌లు ఇక్క‌డ ప‌ర్య‌టించాల‌న్న‌.. ప్రధాన విప‌క్షం కాంగ్రెస్ డిమాండ్‌ను కూడా కూడా మోడీ ప‌ట్టించుకోలేదు. కానీ, త‌గుదున‌మ్మా అంటూ.. ఇప్పుడు బీజేపీ ప్ర‌త్య‌ర్థి పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌ర్య‌టించేందుకు.. బాధిత మ‌హిళ‌ల‌ను ఓదార్చేందుకు ప్ర‌ధాని రెడీ కావ‌డం వివాదాల‌కు కేంద్రంగా మారుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

సందేశ్ ఖాలీ అనేది ప‌శ్చిమ బెంగాల్‌లోని 24 ఉత్త‌ర‌ప‌ర‌గ‌ణాల జిల్లాలో ఉన్న ఓ మారు మూల గ్రామం. ఇక్క‌డ పెను వివాదం రాజుకుంది. అధికార పార్టీ తృణ‌మూల్‌కు చెందిన కీల‌క నేత షాజ‌హాన్ షేక్ అనుచ‌రులు.. త‌మ భూముల‌ను బ‌ల‌వంతంగా క‌బ్జా చేశార‌ని, దీనిని ప్ర‌శ్నించిన త‌మ‌పై.. లైంగిక దాడులు చేశార‌ని, ఒక‌రిద్దరిద్ద‌రిపై అత్యాచారం కూడా చేశార‌ని.. ఇక్క‌డి మ‌హిళ‌లు ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం... గ‌త వారం వెలుగు చూసింది. ఈ విష‌యం రాష్ట్రంలో ప్ర‌చారంలోకి రావ‌డంతో ప్ర‌తిప‌క్ష బీజేపీ దీనిని సీరియ‌స్‌గా తీసుకుంది. వెంట‌నే రాష్ట్ర బీజేపీ చీఫ్‌, పార్ల‌మెంటు స‌భ్యుడు సుకాంత మ‌జుందార్‌.. ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఇటు తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అటు బీజేపీనేత‌ల‌కు మ‌ధ్య తీవ్ర దుమారం రేగింది. వీరిని అదుపు చేసే క్ర‌మంలో పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేశారు. దీంతో ఎంపీ మ‌జుందార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది మ‌రో వివాదానికి దారి తీసింది. ఇప్పుడు ఈ బాధితుల‌నే ప్ర‌ధాని ప‌రామ‌ర్శించ‌నున్నారు.

ఇక‌, ఈశాన్య రాష్ట్రం మణిపుర్ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డి మెజారిటీ మైతేయ్‌ వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశం హింస‌కు దారితీసింది. మార్చి, 2023 నుంచి మైతేయ్‌, మైనారిటీ కుకీల మ‌ధ్య పెను విధ్వంసాలు సాగుతున్నాయి. హింస చెలరేగింది. ఈ మారణకాండలో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అంతేకాదు.. కొంద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారాలు కూడా జ‌రిపారు. ఈ వ్య‌వ‌హారం దేశంలో క‌ల‌క‌లం రేపింది. అయినా.. ప్ర‌ధాని ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టించ‌లేదు. దీంతో బెంగాల్‌లో చిన్న వ్య‌వ‌హారానికే ప్ర‌ధాని రావ‌డం.. మ‌ణిపూర్ త‌గ‌ల‌బ‌డినా ప‌ట్టించుకోక‌పోవ‌డం రాజ‌కీయ దుమారానికి దారి తీయ‌నుంది.