Begin typing your search above and press return to search.

మోడీ విమర్శల వేళ.. 'జాకెట్' వేసేశారుగా?

అనూహ్యంగా.. ఈ రోజు ప్రముఖపత్రికలకు "ఇదే మన తెలంగాణ" పేరుతో నిలువెత్తు కేసీఆర్ ఫోటోతో జాకెట్ యాడ్ వచ్చేయటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:25 AM GMT
మోడీ విమర్శల వేళ.. జాకెట్ వేసేశారుగా?
X

అలవాటైన వ్యూహం అదే పనిగా అమలు చేస్తుంటే అసలు విషయం అందరికి ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తోంది కేసీఆర్ సర్కారు. తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న గులాబీ సర్కారు.. తన పాత వ్యూహాల్ని అదే పనిగా అమలు చేయటంతో.. ఎప్పుడేం జరుగుతుందో ఇట్టే అర్థమైపోతున్న పరిస్థితి. తమ రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా భారీ బహిరంగసభను కానీ.. భారీ ఎత్తున నిరసనలు.. ఆందోళనలు నిర్వహించినా.. లేదంటే తమ ప్రభుత్వానికి మించిన మైలేజీ వచ్చే సందర్భం ఏదైనా సరే.. ఆ వార్తలు మొదటి పేజీలో ప్రముఖంగా రావటం మామూలే.

ఇలాంటి వార్తల్ని అడ్డుకోవటం సాధ్యం కాదు కాబట్టి.. వాటిని కవర్ చేసేలా.. ప్రముఖ దినపత్రికల మొదటి పేజీని కప్పేస్తూ.. తమ ప్రభుత్వం సాధించిన గొప్పల్ని జాకెట్ యాడ్ రూపంలో ఇవ్వటం ఒక వ్యూహంగా చెబుతారు. ఇందుకు తగ్గట్లే.. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో ప్రత్యర్థి పార్టీలు భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించే వేళలో.. అందుకు పోటీగా తాము కూడా ప్రోగ్రామ్ లు పెట్టటం ఒక ఎత్తు అయితే.. జాకెట్ యాడ్ తో పక్కరోజు దినపత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వటం చేస్తుంటారు. తాజాగా అలాంటి తీరును మరోసారి రిపీట్ కావటం ఆసక్తికరంగా మారింది.

నిజామాబాద్ జిల్లా ఇందూరులో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం.. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ తనను కోరారని.. అందుకు తాను ఒప్పుకోలేదన్న సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇదేమీ రాజరికం కాదని.. ప్రజాస్వామ్యమని తాను చెప్పినట్లుగా వెల్లడించారు. నాలుగు గోడల మధ్య జరిగిన వివరాల్ని మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.

యువరాజును ముఖ్యమంత్రి చేయటానికి మీరు మహారాజా అని ప్రశ్నించానని.. అంతకు ముందు భారీ శాలువాతో వచ్చి తనపై ప్రేమ ఒలకబోశారన్నారు. ఎన్డీయేలో బీఆర్ఎస్ ను భాగస్వామిని చేసుకోవాలని కూడా కోరారని.. అందుకు తాను ఒప్పుకోలేదని మోడీ వెల్లడించారు. ఇంతటి సంచలన విషయాలు మాట్లాడిన తర్వాత.. తర్వాతి రోజున దినపత్రికల్లో ఇలాంటివి ప్రముఖంగా రావటం ఖాయం.

అనూహ్యంగా.. ఈ రోజు ప్రముఖపత్రికలకు "ఇదే మన తెలంగాణ" పేరుతో నిలువెత్తు కేసీఆర్ ఫోటోతో జాకెట్ యాడ్ వచ్చేయటం ఆసక్తికరంగా మారింది. తమను దెబ్బ తీసే అవకాశం ఉన్న ప్రతి సందర్భాన్ని ఇలా ప్రకటనలు ఇవ్వటం కేసీఆర్ సర్కారుకు అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.