Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు అంత సీను లేదు.. తేల్చేసిన ప్రధాని మోదీ!

ఆంధ్రాలో పోటీ చేస్తామని, ఆంధ్రా ప్రజలు తెలంగాణ పథకాలను కోరుకుంటున్నారని కేసీఆర్‌ అప్పట్లో పెద్ద డైలాగులే కొట్టారు

By:  Tupaki Desk   |   3 May 2024 11:41 AM GMT
కేసీఆర్‌ కు అంత సీను లేదు.. తేల్చేసిన ప్రధాని మోదీ!
X

ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతానన్నట్టు ఉంది కేసీఆర్‌ పరిస్థితి అని సెటైర్లు పడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టినప్పుడు కేంద్రంలోనూ తాము చక్రం తిప్పుతామని.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్‌ భారీ పగటి కలలే కన్నారు. అధికారం అండగా.. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి.. ప్రత్యేక హెలికాప్టర్‌ లలో, వేలాది కార్ల కాన్వాయ్‌ లతో మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పర్యటించారనే విమర్శలు ఉన్నాయి. అక్కడ ఔట్‌ డేటెడ్‌ రాజకీయ నేతలను, చోటా మోటా నేతలను బీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారు.

ఆంధ్రాలో పోటీ చేస్తామని, ఆంధ్రా ప్రజలు తెలంగాణ పథకాలను కోరుకుంటున్నారని కేసీఆర్‌ అప్పట్లో పెద్ద డైలాగులే కొట్టారు. దేశంలో మొత్తం 150 లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేయాలని పెద్ద ప్రణాళికలే వేసుకున్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో దేశ రాజకీయాలను కనుసైగతో శాసించాలని భారీ ఎత్తునే కలలు కన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తోపాటు స్వయంగా కేసీఆరే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట ముంచేశాడే గంగరాజు అన్నట్టు ఆయన పరిస్థితి పోయింది.

దేశంలో 150 స్థానాల్లో ఏమో కానీ తెలంగాణలో 17 లోక్‌ సభ స్థానాల్లోని కొన్ని స్థానాల్లో పోటీకి కూడా కేసీఆర్‌ కు అభ్యర్థులు కరువయ్యారు. ఇక తెలంగాణకే దిక్కు లేకపోతే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, కర్ణాటకలో సీను ఎక్కడ ఉంటుందని పోటీ మాటే ఎత్తకుండా ఊరుకున్నారు.

ఇప్పుడు తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలిచేది బీఆర్‌ఎస్సేనని.. బీఆర్‌ఎస్‌ లేని కేంద్ర ప్రభుత్వం ఉండదంటూ ఆయన ప్రకటనలు చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించబోతోందని.. బీఆర్‌ఎస్‌ మెజారిటీ అవసరం పడబోతోందని చెబుతున్నారు. కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఖాయమని.. బీఆర్‌ఎస్‌ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని కేసీఆర్‌ చెబుతున్నారు.

అయితే ఆయన ఆశలపై ప్రధాని మోదీ నీళ్లు చిమ్మారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ సంచలన విషయాలను వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400 స్థానాలు ఖాయమన్నారు. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో పార్టీలకు 360 స్థానాలు ఉన్నాయని గుర్తు చేశారు. బీజే పీకి బయట నుంచి మద్దతిస్తున్న బీజేడీ వంటి పార్టీలను కలుపుకుంటే ఎన్డీయే బలం 400 సీట్లకు చేరుతుందన్నారు.

కేసీఆర్‌ మద్దతును స్వీకరిస్తారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆ అవసరమే తమకు రాదని మోదీ చెప్పారు. గతంలో ఆయన ఎన్డీయేలోకి వస్తామంటే తిరస్కరించామని గుర్తు చేశారు. ఈసారి కూడా కే సీఆర్‌ ను ఎన్డీయే కూటమిలో చేర్చుకోబోమని ప్రధాని మోదీ తేల్చేశారు.

మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌ ను తమ ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో అటు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలోకి, ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి కేసీఆర్‌ కు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కేసీఆర్‌ ముందున్న ఏకైక దారి «థర్డ్‌ ఫ్రంటే. అయితే ఇప్పుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాదు.. అధికారంలో లేరు. ఈ నేపథ్యంలో థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ ముందుకొచ్చినా ఆయనను పట్టించుకునేవారెవరూ అనే చర్చ జరుగుతోంది.