Begin typing your search above and press return to search.

మోడీ గురివింద నీతి!

సానుకూల రాజకీయాలతో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వేగంగా ముందుకు దూసుకుపోతోందని మోడీ అన్నారు

By:  Tupaki Desk   |   7 Aug 2023 5:51 AM GMT
మోడీ గురివింద నీతి!
X

నీతులు చెప్పటంలో బీజేపీ ముఖ్యంగా నరేంద్రమోడీ తర్వాతే ఇంకెవరైనా. అవినీతి, వారసత్వం, బుజ్జగింపులను దేశంనుండి తరిమేసే సమయం ఆసన్నమైందట. అవినీతి, వారసత్వాలకు క్విట్ ఇండియా అని చెప్పాల్సిన రోజు దగ్గరపడిందని మోడీ పిలుపిచ్చారు. అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంటే దాన్ని చెడగొట్టడానికి ప్రతిపక్షాల్లో కొన్ని అదేపనిగా పెట్టుకున్నట్లు మోడీ విరుచుకుపడ్డారు. సానుకూల రాజకీయాలతో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వేగంగా ముందుకు దూసుకుపోతోందని మోడీ అన్నారు.

మాటలు చెప్పటంలో మోడీ తర్వాతే ఇంకెవరైనా అని ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపణైంది. మాటలు చెప్పినంతంగా మోడీ వ్యవహారం చేతల్లో కనిపించదు. అవినీతి అంటే డబ్బులు సంపాదించుకోవటం ఒకటే అని మోడీ అనుకున్నట్లున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షాలను కూలగొట్టడాన్ని ఏమంటారు ? కర్నాటక, మధ్యప్రదేశ్ లో బీజేపీ చేసిందాన్ని ఏమంటారో మోడీ చెబితే బాగుంటుంది. రాజస్ధాన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్ చేసి సాధ్యంకాక వదిలిపెట్టారు.

ఇక వారసత్వం గురించి మాట్లాడుతున్న మోడీ బోర్డాఫ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) అధ్యక్షుడిగా అమిత్ షా కొడుకు జై షా ఎలాగయ్యారో చెప్పగలరా ? కేవలం అమిత్ షా కొడుకన్న ఏకైక వారసత్వంతోనే అధ్యక్షుడయ్యారు.

ఇక కొందరు కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రుల వారసులు ఫుల్లుగా ఎక్కడికక్కడ దోచుకునేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు. ఇవన్నీ సరిపోక లక్షల కోట్ల రూపాయల రానీబాకీలను రద్దుచేస్తున్నారు. ఈ బాకీలన్నీ పెద్దపెద్ద కార్పొరేట్లు తీసుకున్న వేలాది కోట్ల రూపాయల అప్పులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది కూడా అవినీతి కిందకే వస్తుంది.

ప్రతిపక్షాల్లోని ప్రముఖనేతలపైకి దర్యాప్తు సంస్ధలను ఉసిగొల్పి లొంగదీసుకోవటం, ప్రతిపక్ష నేతలతో పాటు సమాజంలో ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయటం కోసం పెగాసస్ అనే స్పైవేర్ వాడటం లాంటిది అధికార దుర్వినియోగం కిందకి వస్తుందని మోడీకి తెలీదా ? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎంతరాచి రంపాన పెడుతున్నారో దేశమంతా చూస్తుందో. అప్రజాస్వామిక విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మోడీ నీతులు మాట్లాడుండటమే ఆశ్చర్యంగా ఉంది.