Begin typing your search above and press return to search.

మోడీ చెబితే అధికారంలోకి వచ్చేస్తుందా ?

ఒకపుడు బీజేపీ గ్రాఫ్ బాగా రైజులో ఉండేది. 24 గంటలూ కష్టపడి బండ సంజయ్ పార్టీని పరుగులు పెట్టించేవారు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:50 AM GMT
మోడీ చెబితే అధికారంలోకి వచ్చేస్తుందా ?
X

తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి తేవడంలో భాగంగా పార్టీ నేతలంతా పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడాలని నరేంద్ర మోడీ చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు బహిరంగ సభ తర్వాత నేతలతో మాట్లాడారు. కష్టపడితే బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి రావటం ఖాయమని అందుకు నేతలంతా కలిసికట్టుగా కష్టపడాల్సుంటుందన్నారు. బహిరంగసభ జరిగిన వేదిక మీద ఈటల రాజేందర్ తో మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. బాగా పనిచేయాలని భుజం తట్టి ప్రోత్సహించారు.

ఇదంతా బాగానే ఉందికానీ అసలు పార్టీ కొంపముంచింది తామే అన్న విషయం మోడీ గుర్తులేదా ? అన్నదే ఆశ్చర్యంగా ఉంది. ఒకపుడు బీజేపీ గ్రాఫ్ బాగా రైజులో ఉండేది. 24 గంటలూ కష్టపడి బండ సంజయ్ పార్టీని పరుగులు పెట్టించేవారు.

ప్రతిరోజు ఏదో విషయాన్ని తీసుకుని కేసీయార్ తో పాటు కేటీయార్, కవితను ఎటాక్ చేస్తు నానా రచ్చచేసేవారు. దీనివల్ల పార్టీ నేతలు, క్యాడర్లో మంచి జోష్ కనిపించేది. బండి చేసే ఆరోపణలు, విమర్శలన్నీ ఊకదంపుడువే అయినా డైరెక్ట్ ఎటాక్ చేసేవారు.

వారంలో మూడు, నాలుగు రోజులు పాదయాత్రలని, బస్సుయాత్రలని, ఓల్డ్ సిటిలో భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజల పేరుతో ఎంఐఎంను టార్టెట్ చేసేవారు. ఇలా ఏకకాలంలో ఇటు కేసీయార్ తో పాటు అటు ఎంఐఎంపై విరుచుకుపడేవారు. అంత జోరుమదున్న పార్టీ ఉత్సాహం ఒక్కసారిగా తగ్గిపోవటానికి ఢిల్లీ పెద్దలే కారణం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలకపాత్ర పోషించిందని ఈడీ ఆధారాలతో సహా తేల్చేసినా అరెస్టు జరగలేదు.

స్కామ్ లోని చాలామందిని అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం ఎందుకు అరెస్టుచేయలేదు ? అనే ప్రశ్న అందరిలోను వినిపించింది. దీనికి సమాధానంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అని ఆరోపణలు మొదలుపెట్టారు. ఈ ఆరోపణలను జనాలందరు నమ్మారు.

అదే సమయంలో కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. దాంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా జోరు పెరిగిపోయి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. అప్పుడు పడిపోయిన గ్రాఫ్ మళ్ళీ లేవలేదు. బీజేపీలో చేరాలని అనుకున్న నేతల్లో చాలామంది కాంగ్రెస్ లో చేరిపోయారు. అలాంటిది ఇపుడు ఎంతమంది రాత్రి, పగలు కష్టపడితే బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా ?