Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ బయోపిక్ టీం రెడీ.. టైటిల్ వైరల్!

గుజరాత్ ముఖ్యమంత్రిగా, రెండు సార్లు భారతదేశ ప్రధానిగా మోడీ పేరు ఈదేశ చరిత్రలో అద్భుతంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   23 Jan 2024 8:43 AM GMT
ప్రధాని మోడీ బయోపిక్ టీం రెడీ.. టైటిల్ వైరల్!
X

గుజరాత్ ముఖ్యమంత్రిగా, రెండు సార్లు భారతదేశ ప్రధానిగా మోడీ పేరు ఈదేశ చరిత్రలో అద్భుతంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో మూడోసారి కూడా భారతదేశ పాలనా పగ్గాలు చేపట్టాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే.. మోడీపై ఒక వర్గంలో ప్రశంసలు ఎన్ని ఉన్నాయో.. మరికొన్ని వర్గాల్లో విమర్శలు అంతకు మించి అన్నట్లుగా ఉంటాయని అంటారు. ఈ విషయంపై నిత్యం ఏదో ఒక మూల చర్చలు జరుగుతూనే ఉంటుంటాయి.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మోడీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ప్రధానంగా నిన్న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అనంతరం మోడీ పబ్లిసిటీ పీక్స్ చేరిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పూర్తవ్వని గుడిని ప్రారంభోత్సవం చేశారంటేనే అది ఎందుకనే విషయం తెలిసిందే అనే కామెంట్లు విపక్షాల నుంచి వినిపిస్తున్న సంగతి కాసేపు పక్కనపెడితే... సోమవారం నాడు మాత్రం మోడీ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.

ఈ సమయంలో... ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ తెరకెక్కనుందని తెలుస్తుంది. అవును... "విశ్వనేత" అనే టైటిల్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను అన్ని భారతీయ భాషల్లోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర కాస్ట్ & క్రూ వివరాలు తెరపైకి వచ్చాయి.

ఇందులో భాగంగా.. "విశ్వనేత" అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి "వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్" పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనుండగా... సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని.. త్వరలో సెట్స్‌ పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రధానంగా పదేళ్ల పాటు ప్రధానిగా ఉంటూ... తన పాలనలో దేశంలో సంచలనాత్మక విషయాలపై తీసుకున్న నిర్ణయాలను ఈ సినిమాలో హైలైట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా సార్వత్రిక ఎన్నికల లోపు విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది!