Begin typing your search above and press return to search.

మోడీ సాహసాలు ఎందుకు చేస్తారు?

ఇంతకూ ఆయన సాహసాలు ఎందుకు చేస్తారు? ఆ సందర్భంగా ఆయన ఇచ్చే సందేశం ఏమిటి? అన్నది ప్రధానం

By:  Tupaki Desk   |   9 March 2024 2:30 PM GMT
మోడీ సాహసాలు ఎందుకు చేస్తారు?
X

లక్ష దీవుల్లో స్నార్కెలింగ్ చేయటం.. అరేబియా సముద్రంలో డైవింగ్ చేయటం.. సముద్ర అట్టడుగున ఉన్న ద్వారకకు చేరుకొని.. యోగ ముద్ర వేయటం.. అక్కడ పూజలు చేయటం.. పర్వత సానువుల్లో సాహసయాత్ర చేయాలన్నా.. హిమాలయాల్లో తిరగాలన్నా.. సముద్రం ఒడ్డున చెత్త ఎత్తేయాలన్నా.. కజిరంగ నేషనల్ పార్కులో ఏనుగు సవారీ చేయాలన్నా.. ఇలా చెప్పుకుంటూ పోతే అవకాశం ఉండాలే కానీ.. అంతరిక్షానికి వెళ్లేందుకు వెనుకాడని మొండిఘటంగా చెప్పొచ్చు డెబ్బై మూడేళ్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీని. ఇంతకూ ఆయన సాహసాలు ఎందుకు చేస్తారు? ఆ సందర్భంగా ఆయన ఇచ్చే సందేశం ఏమిటి? అన్నది ప్రధానం.

రాజకీయ నాయకులు రాజకీయం చేయాలన్న నానుడిని నరనరాన జీర్ణించుకున్న మోడీ.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అనూహ్య చర్యలకు పాల్పడుతుంటారు. ఆ మాటకు వస్తే మిగిలిన వారికి భిన్నంగా ఆయన.. కొంతకాలం ముందు నుంచే ఆయన తన ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పాలి. తాజాగా ఆయన రెండు రోజుల పర్యటనకు అసోంకు వెళ్లిన ఆయన.. అక్కడ కజిరంగా పార్కులో ఏనుగు సవారీ చేశారు. ఒక దేశ ప్రధాని ఆ పార్కుకు వచ్చి సవారీ చేయటం కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడేనని చెబుతున్నారు.

ఆ మాటకు వస్తే.. మోడీ చేసిన పనుల్లో కొన్నింటిని కూడా పదేళ్లు ప్రధానిగా ఉన్న వారెవరూ చేయకపోవటాన్ని చూడొచ్చు. తాను చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక మర్మం దాగి ఉండేలా చేయటం మోడీకే చెల్లుతుంది. ఆయన సాహస కార్యాల్ని చూస్తుంటే.. ఎక్కడైతే ఇంతకాలం నిర్లక్ష్యం తాండవిస్తుందో.. తమను ఎవరూ పట్టించుకోరన్న వేదనతో ఉండిపోతారో.. అలాంటి వారందరి మనసులు ఉప్పొంగేలా చేయటమే కాదు.. దేశ ప్రజలు సైతం.. వావ్ అనుకునేలా చేయటమే మోడీ అసలు మేజిక్ గా చెప్పాలి.

లక్ష ద్వీప్ ఎక్కడుందన్న విషయాన్ని ప్రతి వందమంది భారతీయుల్లో ఇద్దరు ముగ్గురికి తెలిసినా గొప్పే. అలాంటిది మోడీ పుణ్యమా అని.. ఇప్పుడు నూటికి పాతిక శాతం మందికి తెలిసేలా చేశారు. సముద్ర గర్భంలో దాగి ఉన్న ద్వారక గురించి యూట్యూబ్ వీడియోల్లో చూసుకోవటమే తప్పించి..గత ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోని దానికి భిన్నంగా.. తాను స్వయంగా వెళ్లటం ద్వారా ఒక్కసారి ద్వారక గురించి అందరూ మాట్లాడుకునేలా చేయటమే కాదు..అసలు ఇంతకాలం ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ప్రశ్న తలెత్తేలా చేశారని చెప్పాలి.

మోడీ 1.0 హయాంలో చూస్తే.. విదేశీ పర్యటనలు చేయటం.. ఆయనో దేశానికి వెళ్లగానే..ఆయన పీఆర్ టీంలు వరుస పెట్టి ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేవి. ఇన్ని దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి సదరు దేశానికి వెళ్లారని. ఇది చదివినంతనే సామాన్యుడి మదిలో మెదిలే ప్రశ్న ఏమంటే.. ఇంత పెద్ద దేశ ప్రధాని అయి ఉండి.. ప్రపంచ దేశాలతో స్నేహంగా ఉండాలి కదా? అలా ఎందుకు చేయలేకపోయారన్న భావన కలిగేలా చేశారు.

ప్రధానమంత్రి అంటే పాలన చేయాలే కానీ సాహసాలు ఎందుకు చేయాలి? ఆయన చేసే సాహసాల్ని ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఎలా అనుమతిస్తున్నారన్న సందేహం కలుగుతుంది. ప్రధానమంత్రే ఏకంగా తాను ఫలానా సాహసం చేస్తానని చెప్పిన తర్వాత తిరుగు ఉంటుందా? పాలన చేయాల్సిన ప్రధాని సాహసాలు ఎందుకు చేస్తారంటే.. దానికి వచ్చే సమాధానం ఆయన పాలనలో భాగంగానే అలా చేస్తున్నారని చెప్పాలి.

తాను ఏం చేయటానికైనా సిద్ధమని.. తాను వెనక్కి తగ్గనని.. యావత్ దేశాన్ని స్ప్రశించే సత్తా తనకు ఉందన్న విషయాన్ని తన ప్రతి సాహసకార్యంలోనూ ఆయన స్పష్టం చేస్తారన్నది మర్చిపోకూడదు. మొత్తంగా చూసినప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పెట్టుకున్న 400 ప్లస్ సీట్ల సాధన కోసం దేనికైనా సిద్ధమవుతారు. దేశ ప్రజల్ని ఒక తాటి మీద తెచ్చేందుకు వీలుగా.. ఆయన దేశం నలు దిక్కులా ఉన్న అన్ని ప్రాంతాల వారిని కనెక్టు చేయటమే ఆయన లక్ష్యమని చెప్పాలి. ఇప్పటికే ఆ లక్ష్యంలో చాలా దూరమే ప్రయాణించారని చెప్పక తప్పదు.