Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీతో భేటీ వేళ.. రేర్ సీన్.. ఎందుకలా?

రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఒకరో ఇద్దరో.. కొన్ని సందర్భాల్లో ముగ్గురో ఉప ముఖ్యమంత్రులుగా ఉండటం మామూలే

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:04 AM GMT
ప్రధాని మోడీతో భేటీ వేళ.. రేర్ సీన్.. ఎందుకలా?
X

రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఒకరో ఇద్దరో.. కొన్ని సందర్భాల్లో ముగ్గురో ఉప ముఖ్యమంత్రులుగా ఉండటం మామూలే. సీఎం పని సీఎం చూసుకుంటే.. ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వారు అప్రాధాన్యతతో ఉండటం కనిపిస్తూ ఉంటుంది. పలు రాష్ట్రాల్లో ఒకేలా ఉండే ఈ వ్యవహారం తెలంగాణలో మాత్రం రోటీన్ కు భిన్నంగా ఉంటున్న పరిస్థితి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటం.. ముఖ్యమంత్రిగా రేవంత్.. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు.


సాధారణంగా దేశ ప్రధానితో భేటీ అయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి వెళతారు. ఉప ముఖ్యమంత్రులు వెళ్లరు. ఒకవేళ వెళ్లినా.. మర్యాదపూర్వకంగా కలిసి బయటకు వస్తారు. ప్రధానితో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడటం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రధాని.. ముఖ్యమంత్రి ఏకాంతంగా మాట్లాడుకోవటం మామూలే. అయితే.. ఇందుకు భిన్నమైన సీన్ మంగళవారం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో కనిపించింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ప్రధాని నివాసానికి వెళ్లారు. మోడీని కలిసిన సందర్భంలో ఆయన పక్క కుర్చీలో రేవంత్ కూర్చోగా.. వారికి అభిముఖంగా ఉన్న సోఫాలో భట్టి కూర్చోవటం.. ప్రధాని మోడీతో భేటీ పూర్తి అయ్యే వరకు సీఎం రేవంత్ తో పాటు.. భట్టి కూడా ఉండటం గమనార్హం. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానిని కలిసిన సందర్భంలో వారిద్దరి మధ్యే జరిగే భేటీకి భిన్నంగా తాజా సీన్ నెలకొంది. ఇదంతా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే జరుగుతుందని చెబుతున్నారు. ఏమైనా.. తాజా పరిణామాలతో డిప్యూటీ సీఎం పదవికి కొత్త గ్లామర్ వచ్చిందని చెప్పక తప్పదు.