Begin typing your search above and press return to search.

విదేశాల్లో పెళ్ళిళ్ళు అవసరమా.... మోడీ సూటి ప్రశ్న

అందులో ఇతర దేశాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడం మీద ఆయన తనదైన శైలిలో సలహాలు ఇచ్చారు

By:  Tupaki Desk   |   26 Nov 2023 1:27 PM GMT
విదేశాల్లో పెళ్ళిళ్ళు  అవసరమా....  మోడీ సూటి ప్రశ్న
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకల్ ఫర్ ఓకల్ నినాదం పెద్ద స్థాయి కుటుంబాలకు చేరాలని కోరడం విశేషం. పేద కుటుంబాలు దాన్ని పాటిస్తున్నారని అయితే పెద్ద కుటుంబాలు మాత్రం కొందరు విదేశాలలో వివాహాలు చేసుకుంటున్నారు అని ఆయన అన్నారు. అలా చేయడం ఎందుకు దేశంలో మీకు నచ్చిన చోట వివాహం చేసుకోండి అని ఆయన సూచించారు.

వెడ్డింగ్ సీజన్ లో ఏకంగా అయిదు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని బిజినెస్ వర్గాల అంచనా. మరి అంత సొమ్ము లోకల్ గా వెడ్డింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తే భారత్ కే దక్కుతుంది కదా అన్నది మోడీ మనసులో మాటగా చెప్పారు. మన్ కీ బాత్ 107వ సంచిక ద్వారా ఆకాశవాణి నుంచి దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మోడీ చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు.

అందులో ఇతర దేశాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడం మీద ఆయన తనదైన శైలిలో సలహాలు ఇచ్చారు. చాలా కాలంగా చూస్తూంటే వివాహాల కోసం చాలా మంది విదేశాలను ఎంచుకోవడం తనకు ఆందోళన కలిగిస్తోందని మోడీ పేర్కొనడం విశేషం.

విదేశాలలో పెళ్ళి చేసుకోవడం అవసరమా అని మోడీ సూటిగా ప్రశ్నించారు. దాని గురించి ప్రజలంతా ఆలోచించాలని ఆయన కోరారు. తన కుటుంబం అంటే ప్రజలు కాబట్టి వారికే తాను ఈ విషయాల గురించి చెబుతున్నానని అన్నారు. మీరు కాకపోతే మరెవరితో చెప్పుకోనూ అని ఆయన ప్రశ్నించడమూ ఇక్కడ గమనార్హం.

ఉన్నత కుటుంబాలలో లోకల్ ఫర్ ఓకల్ నినాదం బలంగా వ్యాపించాలని మోడీ కోరుకోవడం విశేషం. తన ఆవేదన పెద్ద కుటుంబాల వారికి చేరుతుందని భావిస్తున్నట్లుగా మోడీ చెప్పడం కూడా విశేషమే. ఇదిలా ఉంటే నీటి ఎద్దడి నివారణకు ప్రతీ జిల్లాలో అమృత్ సరోవర్ ని ఏర్పాటు చేస్తామని మోడీ ప్రకటించడం కూడా కొత్త విషయంగా చూడాలి.

గుజరాత్ లోని ఆమ్రేలీలో నిర్మించిన విధంగా అమృత సరోవర్ ని ప్రతీ చోటా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించడం కూడా జనాలను ఆలోచింపచేసేదే. ఇక నవంబర్ 26ని ఒక చేదు జ్ఞాపకంగా కూడా ఆయన అంటున్నారు. సరిగ్గా 2008 నంవబర్ 26న ముంబై మీద ఉగ్ర దాడి జరిగిందని,ఇది అత్యంత హేయమైన చర్య అని మోడీ అన్నారు.

ఇలా ఉగ్ర దాడి జరిగినా భారత్ అత్యంత ధైర్య సాహసంతో దాన్ని ఎదుర్కొందని, మళ్లీ తన పూర్తి సామర్ధ్యంతో ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికి పదిహేనేళ్ళు అయినా కూడా ఆ ఘటన మాత్రం ఒక బాధగానే ఉందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఉగ్రదాడిలో అమరులైన వారికి ఆయన ఘన నివాళులు అర్పించారు. అలాగే దేశం కోసం అసువులు బాసిన వారి త్యాగాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అలాగే నవంబర్ 26కి ఎంతో విశిష్టత ఉందని ఆయన అన్నారు. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. అందుకే 2015లో అంబేద్కర్ 125వ జయంతి వేఅళ ఈ రోజున రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించామని మోడీ చెప్పుకొచ్చారు.