Begin typing your search above and press return to search.

ప్ర‌తి ఒక్క‌రినీ జైల్లో వేస్తాం: కేసీఆర్ కుటుంబానికి మోడీ వార్నింగ్‌?

తెలంగాణలో అవినీతి పెరిగిపోయింద‌ని.. ప్ర‌జ‌ల సొమ్మును దోచేస్తున్నార‌ని.. ఇలా అవినీతికి పాల్ప‌డిన ప్ర‌తి ఒక్క‌రినీ జైల్లో వేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హెచ్చ‌రించారు

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:58 PM GMT
ప్ర‌తి ఒక్క‌రినీ జైల్లో వేస్తాం:  కేసీఆర్ కుటుంబానికి మోడీ వార్నింగ్‌?
X

తెలంగాణలో అవినీతి పెరిగిపోయింద‌ని.. ప్ర‌జ‌ల సొమ్మును దోచేస్తున్నార‌ని.. ఇలా అవినీతికి పాల్ప‌డిన ప్ర‌తి ఒక్క‌రినీ జైల్లో వేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హెచ్చ‌రించారు. బీజేపీ నాయ‌కులు త‌ర‌చుగా సీఎం కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ కూడా కేసీఆర్ కుటుంబాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారానికి వ‌చ్చిన మోడీ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స‌భ‌లో ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. బీసీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినే ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ప‌దేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను అడుగ‌డుగునా మోసం చేసింద‌న్నారు. ''నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. మ‌రి అవ‌న్నీ సాకారం అయ్యాయా? అంటే లేదు. నీళ్లు, నిధులు, నియామకాల విష‌యంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం తెలంగాణ స‌మాజాన్ని మోసం చేసింది'' అని మోడీ విమ‌ర్శించారు.

తెలంగాణ కోసం ఎందరోప్రాణ త్యాగాలు చేశార‌ని మోడీ చెప్పారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ నేతలు మాపై ఆరోపణలు చేస్తున్నారని, అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తామని మోడీ హెచ్చరించారు. "మీ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యాను. నేను ప్రధాని అయ్యేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అయ్యింది. అదే సంకల్పంతో తెలంగాణకు బీసీ సీఎం అవుతారు.'' అని మోడీ వ్యాఖ్యానించారు.

ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారని మోడీ చెప్పుకొచ్చారు. ''ఈ నేల(తెలంగాణ‌)తో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. 9 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. ఆయ‌న‌కు(కేసీఆర్‌) బీసీలు, ఎస్సీలు, ఎస్టీలంటే ప‌డ‌దు. ఇక, ఇంటికి పంపేద్దాం" అని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.