Begin typing your search above and press return to search.

ఔను... మోడీ ఆ మాట మ‌రిచారా? విప‌క్షాలు బ‌ల‌ప‌డ్డాయా.. పొలిటిక‌ల్ డిబేట్‌

తాజాగా ఒక‌వైపు బెంగ‌ళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో విప‌క్షాల కూట‌ములు భేటీ అయ్యాయి.

By:  Tupaki Desk   |   18 July 2023 6:51 AM GMT
ఔను... మోడీ ఆ మాట మ‌రిచారా?  విప‌క్షాలు బ‌ల‌ప‌డ్డాయా.. పొలిటిక‌ల్ డిబేట్‌
X

దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. తాజాగా ఒక‌వైపు బెంగ‌ళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో విప‌క్షాల కూట‌ములు భేటీ అయ్యాయి. దీనికి ప్ర‌తిగా మోడీ నేతృత్వంలో మంగ‌ళ‌వారం ఢిల్లీలో ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల కూట‌మితో చ‌ర్చిస్తున్నారు.

అయితే.. ఇక్క‌డ ఒక విష‌యం కీల‌కంగా మారింద‌ని జాతీయ రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. గ‌తంలో గుజ‌రాత్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. కాంగ్రెస్ ప‌ని అయిపోయింద‌ని.. విప‌క్షాలు చేతులు క‌ల‌ప‌డం అసాధ్య‌మ‌ని మోడీ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. కాంగ్రెస్ త‌న‌ను చూసి భ‌య‌ప‌డుతోంద‌ని, ఒక చాయ్ వాలా శ‌త వ‌సంతాల చ‌రిత్ర ఉన్న రాజ‌వంశాన్ని కూక‌టి వేళ్ల‌తో పెక‌లించి వేస్తున్నాడ‌ని ఆందోళ‌న చెందుతోంద‌ని ప్ర‌ధాని హోదాలో నిర్వ‌హిం చిన ఎన్నిక ల‌ప్ర‌చారంలో వ్యాఖ్యానించారు.

ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ మోడీ ఇదే స్వ‌రం వినిపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ మొత్తం రావాలా? కావాలా? అని ప్ర‌శ్నించారు. తాను ఒక్క‌డినే కాంగ్రెస్‌ను ఓడించ‌గ‌ల‌న‌ని చెబుతున్నారు.

కానీ, అనూహ్యంగా ఆయ‌న ఇప్పుడు ఎన్డీయే మిత్ర ప‌క్షాల‌ను క‌లుపుకొని కేంద్రంలో మ‌రోసారి అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికి 34పార్టీల‌ను క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రింత మంది చేరుతార‌ని.. అదేస‌మ‌యంలో అప్ర‌క‌టిత మిత్ర ప‌క్షాలు కూడా త‌మ‌కు ఉన్నాయ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

అంటే.. దీనిని బ‌ట్టి.. మోడీ చేసిన వ్యాఖ్య‌ల్లో వాస్త‌వం ఎంత‌? తాను ఒక్క‌డే కాంగ్రెస్‌ను ఢీకొట్టి గెలుస్తాన‌న్న విశ్వ‌గురు.. ఇప్పుడు బేల అవుతున్నారా? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌.

నిజానికి కాంగ్రెస్ త‌న బ‌ల‌హీన‌త‌ను ఎప్పుడో గుర్తించింది. ఎప్పుడైతే.. రాహుల్ సార‌థ్యంలో 2019లో పార్టీ ఓడిపోయిందో తాము ఒంట‌రిగా మోడీని గెల‌వ‌లేమ‌ని గుర్తించి.. అప్ప‌టి నుంచి కొన్ని నెల‌ల పాటు సైలెంట్‌గానే ఉన్నా.. త‌ర్వాత కూట‌ముల‌కు ప‌దుపు పెట్టింది.

కానీ, మోడీ మాత్రం ఆది నుంచి తాను ఒంట‌రిగానే కాంగ్రెస్‌కు చుక్క‌లు చూపిస్తాన‌ని చెప్పి.. ఇప్పుడు మాత్రం ఎన్డీయే ప‌క్షాల చాటున క‌త్తులు దూసేందుకు సిద్ధం కావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.